డ్రైవింగ్ అనేది ఎంతో బాధ్యతతో కూడిన వ్యవహారం.అందుకే మన దేశంలో దానికోసం లైసెన్స్ తీసుకోవలసి ఉంటుంది.
మన దేశమే కాదు, ఈ ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు డ్రైవింగ్ కోసం కొన్ని టెస్టులు చేసి మరీ డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తూ ఉంటాయి.అయితే ఎన్ని ట్రాఫిక్ చలాన్లు వేసినా.
కేసులు రాసినా కూడా మన ట్రాఫిక్ వ్యవస్థ అనేది పూర్తిగా మారడం లేదనేది వాస్తవం.రద్దీగా ఉండే సమయంలో ఇండియన్ మెట్రో సిటీ రోడ్లపై ఏదైనా వాహనాన్ని నడిపే వ్యక్తి నరకం చూస్తాడు అంటే అతిశయోక్తి కాదు.
ప్రతిరోజూ పెరుగుతున్న ట్రాఫిక్ మరియు వాహనాలతో భారతదేశంలో ర్యాష్ డ్రైవింగ్ ప్రమాదాలు దారుణంగా పెరిగాయి.

అందువల్లనే ప్రపంచంలోనే అత్యంత చెత్త డ్రైవర్లు ఉన్న దేశాల జాబితాలోకి భారత్ చేరిపోయింది.అయితే భారతదేశం అగ్రస్థానంలో లేకపోవడం కొసమెరుపు.‘కంపేర్ ది మార్కెట్’ అనే బీమా కంపెనీ ప్రపంచంలోనే అత్యంత చెత్త డ్రైవర్లు ఉన్న దేశాల జాబితాను తాజాగా తయారు చేసింది.
అందులో భారత్ నాలుగో స్థానంలో ఉండడం గమనార్హం.ఇక ప్రపంచంలోని చెత్త డ్రైవర్ల జాబితాలో థాయిలాండ్ అగ్రస్థానంలో ఉంది.అదేవిధంగా లెబనాన్ 3 ర్యాంక్ తో సరిపెట్టుకోగా పెరూ 2వ ర్యాంక్ ని సాధించింది.

ఇక ప్రపంచంలోని అత్యుత్తమ డ్రైవర్ల జాబితాలో జపాన్ అగ్రస్థానంలో ఉండడం విశేషం.ఈ విషయంలో జపాన్ కి 4.57 పాయింట్లు వస్తే భారత్ కి కేవలం 2.34 మాత్రమే రావడం బాధాకరం.అత్యుత్తమ డ్రైవర్లలో జపాన్ తర్వాత నెదర్లాండ్స్ 2వ స్థానంలో ఉంది.
అదేవిధంగా 3వ స్థానంలో నార్వే ఉండగా, 4వ స్థానంలో ఎస్టోనియా ఉన్నాయి.ఇక మనదేశం విషయానికొస్తే ఇక్కడ ఏటా వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి.
రోడ్లపై ట్రాఫిక్ వాహనాల పెరుగుదలను చూస్తుంటే భారతదేశం నాల్గవ స్థానంలో ఉండటంలో ఆశ్చర్యం లేదు.