సహజ వ్యవసాయం:
భూమిలో ఉండే అన్ని పోషకాలను ఉపయోగించుకుంటూ, గో మూత్రం, పశువుల ఎరువుల ద్వారా చేసే వ్యవసాయాన్ని సహజ వ్యవసాయం గా పేర్కొంటారు.
మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు సహజ పద్ధతిలో వ్యవసాయం చేయడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు.
పైగా సహజ వ్యవసాయం పట్ల పర్యావరణ వేత్తలతో పాటు డాక్టర్లు కూడా ఈ పద్ధతిలో పండే పంటలు ఎంతో నాణ్యమైనవి అంటూ, వీటి ద్వారా అనవసర అనారోగ్య సమస్యలు ఉండవని అవగాహన కల్పిస్తున్నారు.

ప్రస్తుత మార్కెట్లో సహజ పద్ధతిలో పండిన పంటలకు విపరీతమైన డిమాండ్ ఉంది.ఇంకా పెట్టుబడి సగానికి పైగా ఆదా అవుతుంది.అదే బయట నుండి రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడడం వల్ల పంటలో నాణ్యత తగ్గడంతో పాటు పర్యావరణం దెబ్బతినే అవకాశం ఉంది.
వ్యవసాయ క్షేత్ర నిపుణులు సహజ వ్యవసాయం పట్ల ప్రజలకు శిక్షణలు కూడా ఇస్తున్నారు.రైతులందరూ ఈ సహజ వ్యవసాయం వైపు దృష్టి మళ్లిస్తే కొత్త కొత్త రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.

సేంద్రీయ వ్యవసాయం:
సేంద్రీయ వ్యవసాయం అనేది సహజ వ్యవసాయానికి, రసాయన పద్ధతుల ద్వారా చేసే వ్యవసాయానికి మధ్యస్థంగా ఉంటుంది.అంటే ఈ రెండు పద్ధతులను క్రమంగా వాడి చేసేదే సేంద్రీయ వ్యవసాయం.సేంద్రీయ వ్యవసాయంలో పశువుల ఎరువులు, వ్యవసాయ వ్యర్ధాలు, పట్టణ వ్యర్ధాలతో తయారుచేసిన కంపోస్ట్ ఎరువులను వాడతారు.వాన పాములు పెంచి అవి సారవంతం చేసిన వర్మికంపోస్టులను ఎక్కువగా వాడతారు.
ఇంకా పశువుల మూత్రాలను నిలువ చేసి పంటలపై పిచికారి చేస్తారు.వాతావరణం లో మార్పులు జరిగి పంటకు కీటక, శిలీంద్రాల బెడద ఎక్కువగా ఉన్న సమయంలో కేవలం ఐదు శాతం కంటే తక్కువ మోతాదులో రసాయనిక ఎరువులు, పురుగుల మందులు ఈ సేంద్రియ వ్యవసాయంలో వినియోగిస్తారు.
అంటే ఈ మందులు వాడకుంటే పంట చేజారిపోతుంది అనే సందర్భాల్లో మాత్రమే ఈ రసాయనిక మందులను వినియోగిస్తారు.







