గ్రామాలలో ఉండే రైతులకు వ్యవసాయంతో పాటు పాడి పశువులంటే ఎంతో ప్రాణం.ఎంత ప్రాణం అంటే పాడి పశువులను ఇంట్లో కుటుంబ సభ్యులుగా భావిస్తారు.
పాడి పశువులకు అనారోగ్య సమస్యలు వస్తే దగ్గర ఉండి సకల సౌకర్యాలు చేస్తారు.గ్రామాలలో ఉండే వ్యక్తులకు పాడి పశువులకు మధ్య ఉండే అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే.
అయితే ఒకవేళ వాటిని ఎవరన్నా దొంగిలిస్తే చలించి పోవడంతో పాటు అవి దొరకెంతవరకు ఊరికే ఉండలేరు.ఇప్పుడు చెప్పే విషయం వింటే ఇవన్నీ నిజమే అని ఒప్పుకోక తప్పదు.
ఒక రైతు తన ఆవు చోరీకి గురవడంతో పట్టు వదలని విక్రమార్కుడిలా సకల ప్రయత్నాలు చేసి చివరికి తన ఆవును తన వద్దకు తెచ్చుకున్నాడు.
వివరాల్లోకెళితే.
రాజస్థాన్లోని ( Rajasthan ) చురు ప్రాంతంలోని సర్దార్ మహల్ ప్రాంతంలో నివాసం ఉండే 70 ఏళ్ల దులారామ్( Dularam ) అనే రైతుకు చెందిన ఒక ఆవు ( Cow ) 2021 ఫిబ్రవరి 11న ఎవరో దొంగలించారు.అయితే తన ఇంటికి కాస్త దూరంలోనే ఉండే ఒక వ్యక్తి తన ఆవును దొంగలించాడని దులారామ్ గుర్తించాడు.
తన ఆవును తనకు ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగిన ఆ వ్యక్తి ఇవ్వకపోవడంతో ఊరు వ్యక్తులను తీసుకువెళ్లి అడిగినా కూడా ఆ వ్యక్తి ఆవు తనదే అంటూ వాదించాడు.

దులారామ్ చివరకు డిసెంబర్ 14న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పోలీసులు కేసు నమోదు చెయ్యకపోవడంతో చివరికి జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకు వెళ్లడంతో 2021 డిసెంబర్ 21న ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది.కానీ విచారణ మాత్రం నామమాత్రంగా జరిగింది.
అదే సమయంలో ఆ ఆవును దొంగలించిన వ్యక్తి చివరకు దులారామ్ ను దొంగగా చిత్రీకరించే ప్రయత్నం చేయగా.దులారామ్ ఇంటి సమీపంలో ఉండే సెల్ టవర్ ఎక్కి నిరసన చేశాడు.

అదే రోజు సర్దార్ మహల్ కు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వస్తూ ఉండడంతో సమస్య పెద్దదవుతుందని భావించిన పోలీసులు రెండు మూడు రోజుల్లో సమస్యను పరిష్కరించి ఆవు ను తిరిగి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.పోలీసులు ఆ ఆవు డీఎన్ఏ సేకరించి హైదరాబాద్ లోని సీసీఎంబీ ల్యాబ్ కు పంపించి పరీక్ష చేయించారు.దులారామ్ దగ్గర ఉన్న దూడ డీఎన్ఏ తో ఆవు డీఎన్ఏ మ్యాచ్ కావడంతో ఆవును దులారామ్ కు అప్పగించారు.అయితే ఆవు ను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించడం భారత దేశంలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.







