సాధారణంగా రైల్వే స్టేషన్లు చూడటానికి ఒకే విధంగా ఉంటాయి.దేశంలో తక్కువ ఖర్చులో గమ్య స్థానాలకు రైళ్ల ద్వారా సులభంగా చేరుకునే అవకాశం ఉండటంతో రైల్వే స్టేషన్లకు ప్రాధాన్యత పెరిగింది.
దేశంలో ప్రతిరోజూ లక్షల సంఖ్యలో ప్రజలు రైళ్ల ద్వారా ప్రయాణం చేస్తున్నారు.మనం నిత్య జీవితంలో ఎన్నో రైల్వే స్టేషన్లను చూసినా దేశంలో కొన్ని వింతైన, విభిన్నమైన, ప్రత్యేకతలు ఉన్న రైల్వే స్టేషన్లు కొన్ని ఉన్నాయి.
సాధారణంగా రైల్వే శాఖ రైల్వే స్టేషన్లను నిర్మిస్తుంది.అయితే హర్యానాలోని గుడ్ గావ్ తాజ్ నగర్ గ్రామస్థులు 21 లక్షల రూపాయల సొంత ఖర్చుతో రైల్వే స్టేషన్ ను నిర్మించుకున్నారు.
అధికారుల చుట్టూ రైల్వే స్టేషన్ నిర్మించాలని సంవత్సరాల తరబడి తిరిగినా ఫలితం లేకపోవడంతో గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు.గడిచిన పదేళ్ల నుంచి ఈ రైల్వే స్టేషన్ లో రైళ్లు ఆగుతుండగా సమీప ప్రాంతాల ప్రజలకు కూడా ఈ రైల్వే స్టేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతోంది.

రాజస్థాన్ రాష్ట్రంలోని రషీద్ పురా ఖోరిది విచిత్రమైన పరిస్థితి.తక్కువగా ఆదాయం రావడంతో ఈ రైల్వే స్టేషన్ ను 2005లో రైల్వేశాఖ మూసివేయగా అక్కడి స్థానికులు నెలకు మూడు లక్షలు ఆదాయం వచ్చేలా చేస్తామనే షరతుతో 2009లో రైల్వే స్టేషన్ ప్రారంభమయ్యేలా చేసుకున్నారు.ఇక్కడ ఒక్కొక్కొరు రెండు లేదా మూడు టికెట్లు కొనుగోలు చేసి రైల్వే శాఖకు ఆదాయం పెరిగేలా చేస్తున్నారు.

7,407 అడుగుల ఎత్తులో డార్జిలింగ్ హిమాలయాలపై ఉన్న రైల్వే స్టేషన్ లోని రైళ్లలో ప్రయాణిస్తే అక్కడి ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి. పర్యాటకులు ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు.ఇకపోతే ముంబైలో వశి రైల్వే స్టేషన్ పైన ఐటీ కంపెనీలు ఉన్నాయి.
ఒడిశాలోని కటక్ రైల్వే స్టేషన్ లో రైల్వే స్టేషన్ రాజ మహల్ లా ఉంటుంది.బారామతి కోటను పోలి ఉండే ఈ రైల్వే స్టేషన్ ఒడిశాలో ప్రఖ్యాతిగాంచింది.

పశ్చిమ బెంగాల్ లోని రైనా నగర్, రైనా అనే రెండు గ్రామాల మధ్య ఉన్న రైల్వే స్టేషన్ కు రైల్వే శాఖ పేరే పెట్టకపోవడం గమనార్హం.రెండు గ్రామాల మధ్య పేరు విషయంలో ఉన్న గొడవల వల్ల రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.