తెలంగాణ కాంగ్రెస్ లో ఎప్పుడూ ఏదో ఒక రాజకీయ కల్లోలం చోటు చేసుకుంటుంది.ముఖ్యంగా సీనియర్ నాయకుల వ్యవహార శైలి కారణంగా ఆ పార్టీ లోని వ్యవహారాలు బహిరంగం అవుతూ అభాసుపాలు అవుతూ ఉంటాయి.
ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి సీనియర్లు మరింతగా రగిలిపోతున్నారు.ప్రతి విషయంలోనూ తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని , తమ మాట పట్టించుకోవడంలేదని, తమకంటే జూనియర్ వ్యక్తిని తమకు అధ్యక్షుడిగా నియమిస్తే… ఆయన సారథ్యంలో తాము ఎలా పనిచేస్తామంటూ అధిష్టానానికి తరచుగా ఫిర్యాదులు చేస్తూ హడావుడి చేస్తుంటారు.
ఇటీవలే కాంగ్రెస్ అధిష్టానం దూతగా సీనియర్ నేత దిగ్విజయ సింగ్ తెలంగాణకు వచ్చి సీనియర్ నాయకుల అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం చేశారు.వారి సమస్య అడిగి తెలుసుకుని పరిష్కార మార్గాలను సూచించారు.
దిగ్విజ సింగ్ వచ్చి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ లో పరిస్థితి చక్కబడిందని అంత భావిస్తూ ఉండగానే సీనియర్లు మరో రకమైన ఒత్తిడి అధిష్టానంపై తీసుకొస్తున్నారు.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లడం వల్ల ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుందని , అందుకే బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా అధికారంలోకి రావచ్చనే అభిప్రాయాలను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్ వద్ద సీనియర్లు ప్రస్తావించారట.
బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడం అంటే కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్య చేసుకున్నట్లేనని , అటువంటి ఆలోచననేవి పెట్టుకోవద్దని సీనియర్లతో మాణిక్యం ఠాగూర్ తేల్చి చెప్పారట.

రేవంత్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట.ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్లు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారనే గుసగుసలు వినిపించాయి ఇప్పుడు వారే బీఆర్ఎస్ తో పొత్తు ప్రతిపాదనలు చేస్తుండడం తో సీనియర్ల వ్యవహార శైలి పై మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి.
.






