కుటుంబాలలో అనుమానాలకు ఎప్పటికీ చోటు ఇవ్వకూడదు.ఏవైనా అనుమానాలు వస్తే వెంటనే వాటిని పరిష్కరించుకోవాలి.
లేదంటే ఆ అనుమానం పెరిగి చివరికి కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.ఓ కానిస్టేబుల్ ( Constable )తన భార్యపై అనుమానం పెంచుకొని, తన ఫోన్ ఎత్తకపోవడంతో క్షణికావేశంలో భార్యను హత్య చేసిన ఘటన కర్ణాటకలోని చామరాజ నగర్( Chamaraja Nagar ) లో చోటు చేసుకుంది.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
చామరాజ నగర్ కు చెందిన కిషోర్ కుమార్ (32) కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు.కిషోర్ ( Kishore )కు ప్రతిభ (24) తో 2022 నవంబర్ 13న వివాహం జరిగింది.
అయితే వివాహం జరిగినప్పటి నుంచి కిషోర్ కు ప్రతిభ పై అనుమానం ఉండేది.తరచూ ప్రతిభ ఫోన్ కు వచ్చే మెసేజ్లను ఫోన్లను పరిశీలించేవాడు.
ఆమె మాట్లాడే ప్రతి వ్యక్తి గురించి ఆరా తీసేవాడు.ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని అనుమానపు కోణంలో చూడడం కిషోర్ కు అలవాటయింది.

అయితే పది రోజుల కిందట ప్రతిభ ఒక బిడ్డకు జన్మనిచ్చి ప్రస్తుతం పుట్టింట్లో ఉంటుంది.ఈ క్రమంలో ఆదివారం భార్య ప్రతిభకు ఫోన్ చేసి విచక్షణ రహితంగా తిట్టాడు.భర్త తిట్టడంతో భార్య ప్రతిభ ఏడవడం చూసి ఆమె తల్లి ఫోన్ కట్ చేసి, చంటి బిడ్డ ఆరోగ్యం దృష్ట్యా భర్త ఫోన్ కు సమాధానం ఇవ్వవద్దని చెప్పింది.

ప్రతిభ( Pratibha ) కు ఏకంగా 150 సార్లు ఫోన్ చేసినా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో సోమవారం ఉదయం 11:30 సమయంలో అత్తారింటికి వెళ్లి, ముందే క్రిమిసంహారక మందు తాగి ఇంటి తలుపు తట్టాడు.ఆ తర్వాత భార్య గదిలోకి వెళ్లి చున్నీతో ఆమె గొంతు నొక్కి హత్య చేసి బయటకు వచ్చాడు.అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా నిందితున్ని అదుపులోకి తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కిషోర్ కోలుకున్న తర్వాత అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.







