సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు గురిచేయాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది.
దీంతో కేంద్ర ప్రభుత్వం కుట్రను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం ఈడీ ముందు హాజరవుతున్న సమయంలో భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని దేశవ్యాప్తంగా పిలుపునిచ్చింది.
ఈ మేరకు ఢిల్లీలో సత్యమేవ జయతే అంటూ భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలను చేపట్టింది.కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమ పార్టీ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసిందని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.
ఆందోళనలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు చేరుకుంటున్నారు.దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎక్కడిక్కడ కాంగ్రెస్ నేతలను అడ్డుకుని అరెస్టులు చేస్తుండటంతో దేశ రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ సమన్లు జారీ చేయడాన్ని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తప్పుపట్టారు.వారిపై ఈడీ పెట్టిన మనీలాండరింగ్ కేసు నిరాధారమైనదని చెప్పారు.రుణాలను ఈక్విటీలుగా మార్చడం సాధారణ ప్రక్రియ అని.నేషనల్ హెరాల్డ్ విషయంలోనూ అదే జరిగిందని చిదంబరం అన్నారు.అసలు నగదు ఊసేలేని ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు.
అసలు పర్సేలేని వ్యక్తి జేబు నుంచి పర్సు కొట్టేశారని కేసు పెట్టినట్లుగా బీజేపీ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జూన్ 8న విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆమెకు జూన్ 2న కరోనా సోకింది.ఈ మేరకు ఈడీకి లేఖ రాసిన సోనియా.విచారణకు మరో మూడు వారాల గడువు కావాలని కోరారు.
దీనికి అంగీకరించిన ఈడీ.జూన్ 23న హాజరు కావాలని సమన్లు జారీ చేసింది.కాగా ఈడీ నోటీసుల నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.మూడు అంచెలుగా బారికేడ్లు ఏర్పాటు చేశారు.
జల ఫిరంగుల వాహనాలను కూడా మోహరించారు.







