నోటుకు ఓటు కుంభకోణంపై ప్రస్తుతం చిన్నోళ్లు (తెలంగాణ ఏసీబీ) దర్యాప్తు చేస్తున్నారని, ఈ కేసును పెద్దోళ్లు (సిబీఐ) దర్యాప్తు చేయాలని కాంగ్రెసు డిమాండ్ చేసింది.ఈ కేసును సిబీఐ చేత దర్యాప్తు చేయించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరాలని కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు.
రాజ్యాంగ సంక్షోభం రావాలని తాము కోరుకోవడం లేదన్నారు.ఇది చాలా సున్నితమైన కేసు కాబట్టే సీబీఐ విచారణ కోరుతున్నామని చెప్పారు.
సిబీఐ దర్యాప్తును పర్యవేక్షించడానికి హైదరాబాద్ హైకోర్టు లేదా సుప్రీం కోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలన్నారు.ఈ పని చేయకపోతే సీబీఐ దర్యాప్తు కోరుతూ రెండు తెలుగు రాష్ర్టాల కాంగ్రెసు కమిటీలు హైకోర్టులో పిటిషన్ వేస్తాయని డిగ్గీ రాజా చెప్పారు.
నోటుకు ఓటు కుంభకోణం తమకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని చెప్పారు.ఎంతో అనుభం ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ కేసు విషయంలో పరపక్వత లేనివిధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? లేదా? అనే విషయం కేసీఆర్ చెప్పాలన్నారు.ఈ కేసు విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు రాజీ పడతారని దిగ్విజయ్‌కు అనుమనంగా ఉన్నట్లుంది.
అందుకే సీబీఐ దర్యాప్తుకు డిమాండ్ చేస్తున్నారు.ఇందుకు కేంద్రం ఒప్పుకుంటుందా?
.