తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు పార్టీ అంతర్గత విషయాలతో వార్తల్లో నిలుస్తోంది.తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట రెడ్డి మధ్య ఎప్పటి నుండో కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే.
అయితే తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ తరువాత ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగేందుకు తనదైన వ్యూహంతో ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది.అయితే రేవంత్ దూకుడుగా వెళ్ళటంతో కాంగ్రెస్ సీనియర్ లు అలక బూని రేవంత్ నిర్ణయాలకు అంగీకరించడం లేదు.
తద్వారా రేవంత్ కు, కోమటి రెడ్డి లాంటి సీనియర్ లకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో ప్రస్తుత పరిస్థితి ఉంది.రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఎదగాలంటే కాంగ్రెస్ లో సఖ్యత అనేది చాలా అవసరం.
లేకపోతే ఎవరిదారి వారిది అన్న రీతిలో వ్యవహరిస్తే కాంగ్రెస్ పటిష్టతకు ఇంకా చాలా సమయం పట్టడమే కాక ఇక కాంగ్రెస్ కార్యకర్తల్లో నైరాశ్యం మొదలవుతుంది.తరువాత నాయకులు ఎంతగా వ్యూహాలు రచించినా ఏ మాత్రం ఫలితం అనేది క్షేత్ర స్థాయిలో కనిపించదు.
కావున అలాంటి పరిస్థితి రాకుముందే కలిసి కట్టుగా ప్రభుత్వ వైఫ్యల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే ప్రజల్లో కాస్త కాంగ్రెస్ పట్ల విశ్వాసం కలిగే అవకాశం ఉంది.అయితే కాంగ్రెస్ ఇప్పుడు రెండుగా చీలిపోయిన పరిస్థితి ఉంది.
కోమటిరెడ్డి వర్గం, రేవంత్ రెడ్డి వర్గంగా చీలిపోయి పరోక్ష విమర్శలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలపై మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగే విధంగా వ్యవహరిస్తున్నారు.మరి ఇప్పటికే రోజు రోజుకు పరిస్థితులు దిగజారుతున్న తరుణంలో హైకమాండ్ జోక్యం చేసుకొని కోమటి రెడ్డి వెంకట రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య సఖ్యత కుదుర్చడానికి ప్రయత్నిస్తేనే ఈ కోల్డ్ వార్ కు పుల్ స్టాప్ పడే అవకాశం ఉంది.