కష్టకాలం లో ఉన్న పార్టీ కోసం అహర్నిశలు కస్టపడి ఒక గాడిన పడేలా చేసి నియోజకవర్గాల్లో గెలుపుకి బాటలు వేసుకుంటూ.ఆర్ధిక భారమైనా భరిస్తూ ప్రజల్లో తిరుగుతూ.
ఇక ఎన్నికల్లో పోటీ చేసే సమయం కోసం ఎదురుచూస్తున్న ప్రస్తుత నియోజకవర్గ ఇంచార్జ్ లు ఇప్పుడు అధినేత తీరుపై విరుచుకుపడుతున్నారు.ఇంతకాలం కష్టపడిన తమను కాదని నియోజకవర్గ ప్రజలకు పరిచయమే లేని కొత్త వారిని తీసుకొచ్చి వారిని ఎమ్యెల్యే అభ్యర్థులుగా ప్రకటించడం ఏంటి అని వారు మండిపడుతున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి అసంతృప్తులు చాలామందే ఉన్నారు.వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించుకుని, అధికారంలోకి రావాలని భావిస్తున్న జగన్ కు ఈ వ్యవహారాలు ముందరి కాళ్లకు బంధాల్లా మారాయి.

ప్రస్తుతం జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు పార్టీ నేతలకు అస్సలు నచ్చడం లేదు.దీంతో పార్టీలోని సీనియర్లు.తీవ్రంగా అసంతృప్తికి గురై రాజీనామాల బాట పట్టేందుకు సిద్ధం అవుతున్నారు.రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో పరిస్థితి ఈ విధంగానే తయారయ్యింది.ముఖ్యంగా గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో వైసీపీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడే సూచనలు కనిపిస్తున్నాయి.ఇక్కడ వైసీపీ కి అన్ని తానై నడిపిస్తూ బలమైన పునాది వేసిన మర్రి రాజశేఖర్.
వచ్చే ఎన్నికల్లో టికెట్‌పై ఆశలు పెంచుకున్నారు.కింది స్థాయి కేడర్ కూడా బలంగా పనిచేసి మర్రిని గెలిపించేందుకు వ్యూహం సిద్ధం చేసుకుంది.
కానీ అకస్మాత్తుగా ఇక్కడ నుంచి ఎన్నారై మహిళ విడదల రజనీకుమారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.ఈ పరిణామంతో మర్రి వర్గీయులు షాక్ తిన్నారు.జగన్ నిర్ణయం రుచించని వారు పార్టీకి రిజైన్ చేసేందుకు కూడా సిద్దమయ్యారు.ఈ వివాదం ఇలా ఉండగానే ప్రకాశం జిల్లాలోని అత్యంత కీలక నియోజకవర్గం కొండపిలోనూ ఇటువంటి సీన్ రిపీట్ అవుతోంది.
ఎస్సీ నియోజకవర్గం అయిన కొండపిలో వైసీపీ సమన్వయకర్తగా ఉన్న వరికూటి అశోక్‌కుమార్‌ను తప్పించేసి కొత్తగా రిటైర్డ్ డాక్టర్ మాదాసు వెంకయ్య ను నియమించారు.దీంతో కార్యకర్తలంతా భగ్గుమంటున్నారు.

అన్ని రకాలుగా అశోక్ వైసీపీ నుంచి బలమైన అభ్యర్థి అవుతారనుకుంటున్న నేపథ్యంలో ఆయన్ను తప్పించేశారు.ఈ పరిణామం స్థానిక వైసీపీలో చిచ్చు రేపింది.ఇన్నళ్లుగా తాము పార్టీ జెండాలు పట్టుకుని వీధి వీధి తిరిగి అభివృద్ధి చేస్తే.ఇప్పుడు టికెట్ మాత్రం వేరే వారికి ఎలా ఇస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చాలా నియోజకవర్గాల్లో పరిస్థితి దాదాపుగా ఇలానే ఉంది.