టిడిపి, జనసేన, బిజెపి ( TDP, Janasena, BJP )కూటమి ఎమ్మెల్యేలతో టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ( AP CM Chandrababu )నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు.ఎన్డీఏ కూటమి పభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో , చంద్రబాబు ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమై అనేక అంశాలపై చర్చించనున్నారు.
ఈరోజు సాయంత్రం 4 గంటలకు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్ లో ఈ సమావేశం జరగనుంది.దాదాపు మూడు గంటల పాటు ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
100 రోజుల పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించడంతో పాటు, భవిష్యత్ కార్యాచరణ పైన చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటీవల టిడిపి నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ( MLA Koneti Adimulam )మినహా మిగిలిన మూడు పార్టీల ఎమ్మెల్యేలు అందరిని ఈ సమావేశానికి తప్పకుండా హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
ఈ సమావేశం కంటే ముందుగానే ఈరోజు ఉదయం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరుగునుంది.ఆ తర్వాత ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ అవుతారు.వందరోజుల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యేలకు వారి పనితీరుపై ప్రోగ్రెస్ కార్డులు తయారుచేసి ఎవరికి వారికి విడిగా ఇవ్వాలని చంద్రబాబు ముందుగా భావించారు. అయితే అప్పటికి అవి సిద్ధమైతే ఇవ్వాలని , లేని పక్షంలో తర్వాత ఇవ్వాలని భావిస్తున్నారు.
ఇక మిత్రపక్షలకు సీట్లు ఇచ్చిన నియోజకవర్గాల్లో టిడిపి ఇన్చార్జీలు, వైసిపి గెలిచిన స్థానాల్లో ఓడిపోయిన టిడిపి అభ్యర్థులతో కూడా విడిగా సమావేశం నిర్వహించాలని చంద్రబాబు భావిస్తున్నారు.
ఏపీ క్యాబినెట్ సమావేశం
టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు ఉదయం 11 గంటలకు ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మంత్రులు పాల్గొని కీలక అంశాలపై చర్చించనున్నారు .అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తూ ఉండడంతో వాటి విధివిధానాలపైన చర్చించి ఆమోదం ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది .ఇప్పటికే దీనికి సంబంధించి అనేక రాష్ట్రాల్లో మద్యం విధానం పై అధికారులు ఇచ్చిన నివేదికను మంత్రివర్గ ఉప సంఘం అధ్యయనం చేసింది .ఈరోజు జరిగే క్యాబినెట్ సమావేశంలో దీనిపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.