ఆరోగ్య సంరక్షణ రంగంలో తీవ్రమవుతున్న కార్మికుల కొరతను పరిష్కరించడానికి కెనడాలోని న్యూఫాండ్‌లాండ్ అండ్ లాబ్రడార్ ప్రావిన్స్ కీలక నిర్ణయం తీసుకుంది.అంతర్జాతీయంగా శిక్షణ పొందిన, రిజిస్టర్ అయిన నర్సులను ఎంచుకునేందుకు గాను బెంగళూరులో రిక్రూట్‌మెంట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపింది.
తమ వద్ద నర్సుల కోసం తీవ్ర కొరత వుందని.న్యూఫాండ్‌లాండ్ అండ్ లాబ్రడార్ ప్రీమియర్ ఆండ్రూ ఫ్యూరీ గతవారం ఒక మీడియా సమావేశంలో అన్నారు.
ఈ క్లిష్ట సమయంలో ఆరోగ్య సంరక్షణ నిపుణులను ఆకర్షించడానికి, నిలుపుకోవడానికి తాము అధికార పరిధి దాటి పోటీపడుతున్నట్లు ఫ్యూరీ తెలిపారు.అలాగే తమ ప్రావిన్స్‌లో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఎదుర్కొంటున్న సిబ్బంది సమస్యలను పరిష్కరించడానికి తమ ప్రభుత్వం, ఇతర భాగస్వాములు చర్యలు తీసుకుంటున్నారని ప్రీమియర్ వెల్లడించారు.
దీనిలో భాగంగా కెనడాలో లైసెన్స్ పొందేందుకు అర్హత కలిగిన గ్రాడ్యుయేట్ నర్సులను బెంగళూరులో రిక్రూట్‌మెంట్ బృందం కలవనుంది.
న్యూఫాండ్‌లాండ్ అండ్ లాబ్రడార్ ప్రావిన్స్‌లోని నర్సుల యూనియన్ సభ్యులలో 40 శాతం మంది 24 గంటల షిఫ్ట్‌ల్లో పనిచేయాల్సి వస్తోందని ఫ్యూరీ ఆవేదన వ్యక్తం చేశారు.
దీనితో పాటు కార్యాలయాల్లో దాడులకు, హింసకు గురవుతున్నారని ప్రీమియర్ వెల్లడించారు.ఈ పరిస్ధితులను చక్కదిద్దకుంటే తక్షణం వృత్తిని వదిలేస్తామని నర్సులు ప్రభుత్వానికి తేల్చిచెప్పారు.
న్యూఫాండ్‌లాండ్ అండ్ లాబ్రడార్‌ల తరహాలో నాణ్యమైన శిక్షణను అందించే 100కి పైగా నర్సింగ్ పాఠశాలలు వున్నందున తాము భారత్‌లోని కర్ణాటక రాష్ట్రాన్ని ఎంచుకున్నట్లు ఫ్యూరీ వెల్లడించారు.ఇమ్మిగ్రేషన్ మంత్రి గెర్రీ బైర్న్ మీడియాతో మాట్లాడుతూ.
రష్యా దాడుల నుంచి పారిపోతున్న ఉక్రేనియన్లను ఆకర్షించడానికి ఏర్పాటు చేసిన పోలాండ్‌లోని ప్రావిన్స్ శాటిలైట్ కార్యాలయం తరహాలోనే బెంగళూరులో రిక్రూట్‌మెంట్ ప్రయత్నం వుంటుందని ఆయన అన్నారు.

స్టాటిస్టిక్స్ కెనడా ప్రకారం.2016 నుంచి 2021 వరకు అట్లాంటిక్ కెనడాలో ఇమ్మిగ్రేషన్ ద్వారా ఈ ప్రావిన్స్ అతి తక్కువ వృద్ధిని సాధించింది.ఆ కాలంలో కెనడాలో దిగిన వలసదారులలో 0.3 శాతం మందికి మాత్రమే స్వాగతం పలికింది.2016 నుంచి 2021 మధ్యకాలంలో 1.3 మిలియన్లకు పైగా కొత్త వలసదారులు కెనడాలో శాశ్వతంగా స్ధిరపడ్డారు.అయితే ఆ వలసదారులలో 4,000 కంటే తక్కువ మంది న్యూఫాండ్‌లాండ్ అండ్ లాబ్రడార్‌లో స్థిరపడ్డారు.
అదే సమయంలో ఐర్లాండ్, మాల్టా, జర్మనీ, నెదర్లాండ్స్, ఫిన్లాండ్, యూకే, బెల్జియంలలో కోవిడ్ తర్వాత భారతీయ నర్సులకు డిమాండ్ గణనీయంగా పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.ఫిలిప్పీన్స్ తర్వాత విదేశాలలో పనిచేసే నర్సుల సంఖ్యలో భారతదేశం రెండవ స్థానంలో వుంది.







