తెలంగాణలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చుకుంటూ మూడోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది అధికార పార్టీ బీ ఆర్ ఎస్.ఈసారి బిజెపి ,కాంగ్రెస్ లో నుంచి తీవ్రస్థాయిలో పోటీ నెలకొనబోతుండడంతో, ఆ రెండు పార్టీల వ్యూహాలను చిత్తు చేసే విధంగా సరికొత్త ఎత్తుగడలతో తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది.
దీనిలో భాగంగానే బీఆర్ఎస్ నుంచి ముగ్గురు కీలక నేతలు రంగంలోకి దిగారు.మంత్రి హరీష్ రావు( HARISH RAO ) , కేటీఆర్ ఎమ్మెల్సీ కవితలు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటనలు చేస్తూ, బీఆర్ఎస్( BRS ) ప్రభావాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో , మూడోసారి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు పక్కా ప్రణాళికతో బీఆర్ఎస్ వ్యూహాలు పన్నుతోంది.ఇప్పటికే పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.దీంతో క్షేత్రస్థాయి నుంచి పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునే పనుల్లో బీఆర్ఎస్ నిమగ్నమైంది .ఒకవైపు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తూనే, ప్రతిపక్షాలు ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.అలాగే క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ దానికి అనుగుణంగా స్థానిక నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు .మంత్రి కేటీఆర్ ( KTR ), మరో మంత్రి హరీష్ రావు ఈ ఇద్దరు మంత్రులు ప్రభుత్వ కార్యక్రమాల పేరుతో , జిల్లా పర్యటనలు చేస్తూ సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.ఎన్నికల షెడ్యూల్ వెలువడేనాటికి రాష్ట్ర వ్యాప్తంగా సగానికి పైగా నియోజకవర్గాల్లో పర్యటనలు పూర్తి చేసే విధంగా మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ తో పాటు ఎమ్మెల్సీ కవితకు కెసిఆర్ బాధ్యతలు అప్పగించారు.

ఈ ముగ్గురు క్షేత్రస్థాయిలో అధికారిక కార్యక్రమాలతో పాటు , ఎన్నికల ప్రచారాన్ని తలపించే విధంగా భారీగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు .అనేక అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు చేస్తూ ప్రారంభోత్సవాలు పేరుతో జిల్లాలు , నియోజకవర్గ పర్యటనలు చేస్తున్నారు.ఈ ముగ్గురు నేతలు ఎవరికి వారు తమ సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తూ , పెద్ద ఎత్తున పార్టీలో చేరికల పైన దృష్టి సారించారు.
అలాగే అసంతృప్తి నేతలు ఎవరూ పార్టీ మారకుండా తమతైన శైలిలో వారితో మంతనాలు చేస్తూ, వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.ఈ విధంగా కేటీఆర్ ,కవిత , హరీష్ రావు ఈ ముగ్గురు పూర్తిగా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ పార్టీని మరింత బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.