టిఆర్ఎస్ పేరుతో ఉద్యమ పార్టీని ప్రారంభించి, ప్రత్యేక తెలంగాణ సాధించడంతో పాటు, రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఆ పార్టీ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ కు దక్కుతుంది.ఇక తెలంగాణతో పాటు, దేశ రాజకీయాల్లోనూ తమ సత్తా చాటుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ బిఆర్ఎస్ అనే జాతీయ పార్టీని స్థాపించారు.
దాంట్లో టిఆర్ఎస్ పార్టీని విలీనం చేశారు.జాతీయస్థాయిలో రాబోయే ఎన్నికల్లో ప్రభావం చూపించేందుకు, అన్ని రాష్ట్రాల్లోనూ పట్టు సాధించే విధంగా కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.జాతీయ రాజకీయాలకంటే ముందుగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో,
ఇక్కడ కచ్చితంగా బీఆర్ఎస్ అధికారంలోకి మళ్ళీ వస్తేనే జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ సత్తా చాటేందుకు అవకాశం ఏర్పడుతుంది.అయితే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీకి టిఆర్ఎస్ పేరుతో కొత్తగా ఏర్పాటు కాబోతున్న పార్టీతో కొత్త తలనొప్పులు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.బిఆర్ఎస్ లో అసంతృప్తితో ఉన్న నేతలతో పాటు మరికొంతమంది కీలక నాయకులు అంతా కలిపి టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండడం, బిఆర్ఎస్ పార్టీ నేతలకు ఆందోళన కలిగిస్తోంది.
ముఖ్యంగా ఖమ్మం మాజీ ఎంపీ , బీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సారథ్యంలో టిఆర్ఎస్ ఏర్పాటు కాబోతున్నట్లుగా గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది.దీంతోపాటు ఉమ్మడి నల్గొండ, కరీంనగర్ , ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలు ఈ పార్టీ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తున్నారట .ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.ఒకవేళ నిజంగానే టిఆర్ఎస్ పార్టీ కొత్తగా తెలంగాణలో ఏర్పడితే ఆ ప్రభావం బీఆర్ఎస్ పై తీవ్రంగా ఉండడంతో పాటు, ఎన్నికల్లో భారీగా నష్టం జరుగుతుందనే ఆందోళనలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారట.