అమెరికాలో అధ్యక్ష ఎన్నికల( America Presidential election ) సందడి ఊపందుకుంది.రిపబ్లికన్ పార్టీలో ఒక్కొక్క నేత పోటీ నుంచి తప్పుకుంటున్నారు .
ఇప్పటికే భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్‌లు బరిలోంచి తప్పుకున్నారు.ప్రస్తుతం ఆ పార్టీలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత సంతతికి చెందిన నిక్కీ హేలీకి మధ్యే పోటీ నడుస్తోంది.
డెమొక్రాటిక్ పార్టీలో మాత్రం అంత ఊపు కనిపించడం లేదు.ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌కు పోటీ ఇచ్చే స్థాయిలో ఏ డెమొక్రాట్ నేతా కనిపించడం లేదు.ఈ క్రమంలో ఎన్నికల్లో అన్ని వర్గాల మద్ధతు కూడగట్టేందుకు జో బైడెన్ పావులు కదుపుతున్నారు.దీనిలో భాగంగా వచ్చే వారం సౌత్ కరోలినా డెమొక్రాటిక్ ప్రైమరీపై ఆయన దృష్టి పెట్టారు.
ఈ స్టేట్‌పై ఆయన పెద్దగా భయపడటం లేదు.

కానీ రిపబ్లికన్‌లకు కంచుకోట వంటి సౌత్ కరోలినాలో డెమొక్రాట్లకు అంత తేలిక కాదు.1976 నుంచి ఈ రాష్ట్రం రిపబ్లికన్లకు బ్రహ్మరథం పడుతూ వస్తోంది.నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ఈ స్టేట్‌లో గెలవడం కష్టమని బైడెన్‌కు తెలియనిది కాదు.
అయితే 2020 నాటి ఎన్నికల్లో తన ప్రచారాన్ని కాపాడిన ఈ రాష్ట్రానికి ఆయన విధేయుడిగా వున్నారు.ఇక్కడి నల్లజాతీ ఓటర్ల మద్ధతును తిరిగి సంపాదించాలని బైడెన్ నిర్ణయించుకున్నారు.
తాను అధ్యక్షుడిగా వుండటానికి మీరే కారణమని బైడెన్ తొలి డెమొక్రాటిక్ ప్రైమరీకి ముందు ఫైండ్ రైజింగ్ పార్టీకి హాజరైన వారితో అన్నారు.కమలా హారిస్( Kamala Harris ) తొలి మహిళా ఉపాధ్యక్షురాలు కావడానికి, ట్రంప్ ఓడిపోవడానికి , తాము మరోసారి గెలవడానికి కారణం మీరేనని అధ్యక్షుడు వ్యాఖ్యానించారు.

ఈ ఆదివారం సెయింట్ జాన్ బాప్టిస్ట్ చర్చిలో జరిగే కార్యక్రమంలో రాజకీయాలు, విశ్వాసాల కలబోతగా ఇక్కడ గడిపేందుకు బైడెన్ సిద్ధమయ్యారు.అమెరికా మాజీ అధ్యక్షులు నల్లజాతి వర్గం పట్ల అనుసరించిన విధానాలను విమర్శించడంతో పాటు తాను ఏం చేశానో చెబుతూ వారిని తనవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.బైడెన్ డిప్యూటీ క్యాంపెయిన్ మేనేజర్ క్వెంటిన్ ఫుల్క్స్ మాట్లాడుతూ.2024లో జీవోపీ ఫ్రంట్ రన్నర్ డొనాల్డ్ ట్రంప్( Donald Trump )తో తిరిగి పోటీ చేయబోయే ముందు, పార్టీకి వెన్నెముక అయిన నల్లజాతి ఓటర్లను తిరిగి యాక్టివేట్ చేయడంపై తమ టీమ్ పాఠాలు నేర్చుకోవాలనుకుంటోందన్నారు.అటు బైడెన్ కూడా యూఎస్ మెక్సికో సరిహద్దుల్లో అక్రమ ఇమ్మిగ్రేషన్‌ను అడ్డుకోవడానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.చట్టసభ సభ్యులు దేశ ఇమ్మిగ్రేషన్ విధానాల్లో సంస్కరణలు తీసుకురావాలని భావిస్తున్నారని, ఒకవేళ అటువంటి బిల్లు వస్తే సరిహద్దును మూసివేస్తానని బైడెన్ పేర్కొన్నారు.