యాదాద్రి జిల్లా:ఆలేరు మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు గత కొన్ని రోజులుగా వీఆర్ఏ చేస్తున్న నిరవధిక సమ్మెకు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల ఐలయ్య శుక్రవారం సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 54 రోజుల నుండి వీఆర్ఏలు నిరసన వ్యక్తం చేస్తున్నా కేసీఆర్ ఒక్కసారి కూడా విఆర్ఏల కోసం ఆలోచించటం లేదని విమర్శించారు.
వీఆర్ఏల పే స్కేల్ జి.ఓ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.అర్హత కలిగిన వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలన్నారు.55 ఏళ్ళు నిండిన వీఆర్ఏల స్థానంలో వారసులకు ఉద్యోగం ఇవ్వాలని,మరణించిన వారి స్థానంలో కారుణ్య నియామకం చేపట్టాలని కోరారు.వీఆర్ఏలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.బొమ్మలరామరం మండలం తిరుమలగిరికి చెందిన విఆర్ఏ భిక్షపతి కలెక్టరేట్ లో జరిగే నిరసనకు వెళ్తున్న సందర్భంలో రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా బాధాకరమన్నారు.
మరణించిన విఆర్ఏ కుటుంబన్నీ పరామర్శించి ఆర్థిక సహాయం కూడా చేశామని అన్నారు.రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తప్పకుండా వీఆర్ఏలకు అండగా ఉంటుందనని అన్నారు.
వీఆర్ఏలు చేసిన సేవలు మర్చిపోయి ప్రభుత్వం ఈరోజు వీఆర్ఏలను దిక్కుతోచని స్థితిలో వదిలిపెట్టడం ఎంతవరకు సమంజసమని వ్యాఖ్యానించారు.గత ప్రభుత్వాలు వీఆర్ఏలతో పని చేయించుకున్నాయి.కానీ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కెసిఆర్ మొండివైఖరిని స్పష్టంగా కనిపించిందన్నారు.కావున వీఆర్ఏల న్యాయమైన కోరికలు తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలేరు మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వరాజు,టౌన్ పార్టీ అధ్యక్షుడు ఎజాజ్,ఎంపీపీ అశోక్,వర్కింగ్ ప్రసిడెంట్ సిరిగిరి సాగర్,వైస్ ఎంపీపీ లావణ్య వెంకటేష్,మాజీ సర్పంచ్ లు నర్సింహులు,ఉప్పలయ్య,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.







