ఇటీవల కాలంలో ఏపీ అధికార పార్టీ వైసీపీ లో అసంతృప్తులు పెరిగిపోతూ వస్తున్నారు.కొంతమందిని బుజ్జగిస్తూ దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుండగా, మరికొంతమందిపై బహిష్కరణ వేటు వేస్తోంది.
ప్రస్తుతం ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో, అసంతృప్తులను మరింత దూరం పెట్టే కంటే, వారిని బుజ్జగించి దారికి తెచ్చుకోవడం ద్వారానే ఆశించిన ఫలితాలు వస్తాయని వైసిపి అధినేత, సీఎం జగన్( CM Jagan ) భావిస్తున్నారు.

ఇక వైసిపి సీనియర్ నేత, జగన్ బంధువు బాలినేని శ్రీనివాస్ రెడ్డి నాలుగు రోజుల క్రితం వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాధ్యతలు నుంచి తప్పుకుంటున్నట్లు రాజీనామా లేఖను పార్టీకి పంపించారు.అయితే రెండో విడత మంత్రివర్గ విస్తరణలో తనను కొనసాగించకపోవడం, తమ జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్( Audimulapu Suresh ) ను ఇప్పటికీ కొనసాగిస్తూ, ఆయనకు ప్రాధాన్యం ఇస్తుండడనే బాలినేని అలక చెందారనే ప్రచారం జరిగింది.

ఈ వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో, వైసిపి పెద్దలు బాలినేనిని ( Balineni Srinivasa Reddy )బుజ్జగించడంతో పాటు, జగన్ తో భేటీని ఏర్పాటు చేయించారు.జగన్ ను కలిసిన బాలినేని దాదాపు అర గంట పాటు అనే అంశాలపై చర్చించారు.తాను వైసిపి రీజినల్ కోఆర్డినేటర్ బాధ్యతలు నుంచి తప్పుకోవడానికి గల కారణం అనారోగ్యమని, అందుకే పార్టీ పదవులకు రాజీనామా చేసినట్లు బాలినేని చెప్పారట.
అంతే కాకుండా, ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో తన సొంత నియోజకవర్గ ఒంగోలు పైన ఫోకస్ చేయాల్సి ఉందని జగన్ కు వివరించారు.దీంతో పాటు మంత్రి పదవి కోల్పోయిన తర్వాత జిల్లాలో ఎదురవుతున్న ప్రోటోకాల్ సమస్యను కూడా జగన్ దృష్టికి బాలినేని తీసుకువెళ్లారట.

దీనిపై స్పందించిన జగన్ సీనియర్ నేతగా తగిన గౌరవం ఎప్పుడు పార్టీలో ఉంటుందని, అలాగే మీ గౌరవానికి ఎటువంటి భంగం కలగకుండా చూస్తానని బాలినేని కి జగన్ హామీ ఇచ్చారట.ఒంగోలు నియోజకవర్గంతో పాటు, జిల్లాలోని ఇతర నియోజకవర్గాల పైన, పార్టీ వ్యవహారాల పైన దృష్టి పెట్టి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జగన్ సూచించారట.దీంతో పాటు ప్రకాశం జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో అంతర్గతంగా పార్టీ సమస్యలు ఉండడంతో, వాటిని చక్కదిద్దే బాధ్యతలను బాలినేనికి జగన్ అప్పగించినట్లు తెలుస్తోంది.జగన్ నుంచి ఈ స్థాయిలో హామీ లభించడంతో బాలినేని కూడా ఖుషి అయ్యారట.