Baahubali 2 Movie Review

చిత్రం : బాహుబలి 2 – ది కంక్లూజన్

బ్యానర్ :

అర్కా మీడియా

 Baahubali 2 Movie Review-TeluguStop.com

దర్శకత్వం :

ఎస్ ఎస్ రాజమౌళి

నిర్మాతలు :

శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని

సంగీతం :

ఎమ్ ఎమ్ కీరవాణి

విడుదల తేది :

ఏప్రిల్ 28, 2017

నటీనటులు – ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, తదితరులు

200 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని కొట్టలేక నానా తంటాలు పడుతున్న తెలుగు సినిమాని 600 కోట్ల మైలురాయిని దాటించిన ఘనత ఎస్ ఎస్ రాజమౌళిది.దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా జండాను ఎగురవేసిన జక్కన్న, ఇప్పుడు బాహుబలి రెండొవ భాగంతో 1000 కోట్ల క్లబ్ కి రిబ్బన్ కట్టింగ్ చేయనున్నారు.మరి బాహుబలి మొదటిభాగంతో హాలివుడ్ స్థాయి సినిమా చూపించిన రాజమౌళి, బాహుబలి 2 తో అంచనాలను అందుకున్నారా లేదా రివ్యూలో చూడండి.

కథలోకి వెళితే :

కాలకేయులతో జరిగిన యుద్ధంలో శతృ సంహారంతో పాటు ప్రజల్ని రక్షించిన అమరేంద్ర బాహుబలి మాహీశ్మతి రాజుగా నియమించబడతాడని ప్రకటిస్తుంది రాజమాత శివగామి.దేశ పర్యాటనకి వెళ్ళిన బాహుబలి కుంతల రాజ్య రాణి దేవసేనని చూసి ప్రేమలో పడతాడు.ఈ విషయాన్ని తెలుసుకున్న భల్లాలదేవుడు దేవసేనని కాంక్షిస్తాడు.తనని సొంతం చేసుకునేందుకు కుయక్తులు పన్నుతాడు.కాని విఫలయత్నాలు చేసిన భల్లాల తండ్రి బిజ్జలదేవుడి అండతో మాహిశ్మతి కీరీటాన్ని దక్కించుకుంటాడు.

ఈ కథలో కుమార వర్మ ఎవరు? దేవసేన – బాహుబలి ప్రేమకథలో అతని పాత్ర ఏమిటి ? దేవసేన ప్రేమని పొందలేకపోయిన భల్లాలుడు ఏం చేసాడు? బాహుబలి రాజుగా నియమించారా లేదా? అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? నిజానిజాలు తెలుసుకున్న శివుడు భల్లాలుడిపై పగ ఎలా తీర్చుకున్నాడు.ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పడం కరెక్టు కాదు .మీరే తెలుసుకోవాలి.

నటీనటుల నటన :

బాహుబలి మొదటిభాగంలో చాలామంది వ్యక్తపరిచిన అభిప్రాయం ఏమిటంటే, ప్రభాస్ రానాలని ఇటు రమ్యకృష్ణ, అటు సత్యరాజ్ తమ అభినయంతో డామినేట్ చేసారని.కాని ఈసారి అలాంటి అవకాశం ఇవ్వలేదు ప్రభాస్.మొదటిభాగంలో అమరేంద్ర బాహుబలి యుద్ధవిద్యలని మాత్రమే చూడగలిగాం.కాని రెండోవ భాగంలో అతనిలోని భావోద్వేగాలు కనబడతాయి.ఆ ఎమోషన్స్ ని గొప్పగా పండించాడు ప్రభాస్.

కటప్ప బాహుబలిని చంపే సీన్ లో ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్ చెబుతాయి ప్రభాస్ ఎంత మంచి నటుడో.డార్లింగ్ కెరీర్ లో ఇప్పటివరకు ఇదే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని ఎటువంటి అనుమానం లేకుండా చెప్పవచ్చు.

దేవసేన పాత్ర విపరీతంగా ఆకట్టుకుంటుంది.దేవసేన పాత్రను అనుష్క పోషించిన తీరు మరింత ఆకట్టుకుంటుంది.హీరోయిన్లలో తనకు మాత్రమే సాధ్యపడే ఆ రాజసం, ఆ ఠీవి అనుష్క ఆభరణాలు.ఈసారి ఆ రాజసానికి అందం, సొగసు కూడా తోడైంది.

రానా విలనిజం యొక్క సాంపిల్ మొదటిభాగంలో చూపిస్తే, రెండొవభాగంలో ఆ విలనిజం కొత్త పుంతలు తొక్కింది.ముఖ్యంగా భల్లాలదేవుడు – కట్టప్ప మధ్య వచ్చే సన్నివేశాలు ఆ విలనిజం మార్కుని చూపిస్తాయి.

మొదటిభాగం లాగే రమ్యకృష్ణ, సత్యరాజ్ మెరవగా, నాజర్ తన పెర్ఫార్మెన్స్ ని మరోమెట్టు పైకి ఎక్కించారు.ఓరకంగా చెప్పాలంటే విలనిజంలో భల్లాల కన్నా బిజ్జలే పైఎత్తులో ఉంటాడు.

కథలో అనవసరం అనుకున్న పాత్ర సుబ్బరాజుది.కాని అనవసరం కాదు.అలాగని ప్రయత్నించిన కామెడి పేలిందని చెప్పలేం.

టెక్నికల్ టీమ్ :

సాబు సిరిల్ పర్యవేక్షణలో రూపొందిన సెట్స్, కుంతల రాజ్యం ఏ హాలివుడ్ సినిమాకి తక్కువ కాదు.కుంతల రాజ్యం అందాలు, ముఖ్యంగా హంసనావ పాటకి వాడిన ప్రాపర్టీస్, ఆ పాటలో కుదిరిన సిజీ ఒక్కమాటలో చెప్పాలంటే “అద్భుతః”.సెంధీల్ సినిమాటోగ్రాఫి, పెట్టుకున్న ఫ్రేమ్స్ గురించి సరిగా పొగడాలంటే సినిమా కనీసం అయిదారు సార్లు చూడాలి.

హంసనావ పాటకి ఆయన సినిమాటోగ్రాఫి ఎలాంటి జిమ్మిక్కులు చేసిందో మీరు తెర మీదే చూడాలి.రాజమౌళి సినిమాకి కీరవాణి సంగీతం ఎలా ఉంటుందో వేరే చెప్పాలా? ఇంటర్వెల్ కి 20 నిమిషాల ముందు నుంచి ఇంటర్వల్ దాకా ఆయనిచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది అని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.సెకండాఫ్ ఎడిటింగ్ అక్కడక్కడ పట్టు తప్పినట్లు అనిపించినా, ఆ వేడిలో అన్నీ కలిసిపోతాయి.వీ ఎఫ్ ఎక్స్ కొన్ని సన్నివేశాల్లో తేలిపోయినా, 90% సీన్లలో సీజీ వర్క్ భారతీయ సినిమాల్లో మునుపెన్నడు చూడనివి.

విశ్లేషణ :

ఈ సినిమాని ఒక్కపూటలో విశ్లేషించడం అంటే అది జరిగేది కాదు.ఎదో ఒకటి రెండు సీన్ల గురించి చెప్పాలంటే చెప్తాం కాని ప్రతి ఫ్రేము ఒక మామూలు సినిమాని అవమానిస్తోంటే, దేని గురించి ఎలా మాట్లాడాలో ఏం గుర్తుపెట్టుకుంటాం ! బాహుబలి మొదటిభాగం గుర్తుకువచ్చేలా టైటిల్స్ తో మొదలైన సినిమా, ప్రభాస్ ఇంట్రోడక్షన్ షాట్ తో మంచి మూడ్ ని క్రియేట్ చేస్తుంది.

అక్కడినుంచి మొదలు ఫస్టాఫ్ కి ఎలాంటి బ్రెకులు లేవు.దేవసేన పాత్రలో బలం, బాహుబలి – భల్లాలల మధ్య ముదురుతున్న శతృత్వంతో మనం ఊహించినదానికన్నా ఎక్కువ ఆసక్తిగా సాగిపోయిన ఫస్టాఫ్ కి ఇంటర్వల్ ప్రాణం.

న భవిష్యత్తు అని చెప్పలేం కాని, న భూతో.రాజమౌళి సినిమాల్లో ది బెస్ట్ ఇంటర్వల్.కాని ఫస్టాఫ్ లో ఉన్న టెంలో సెకండాఫ్ లో తగ్గుతుంది.క్లయిమాక్స్ సీన్లు బ్రహ్మాండమైన సినిమాకి బ్రహ్మాండమైన ముగింపునివ్వవు.

అయినా సరే, బాహుబలి 2 పైసా వసూల్ సినిమా.బాహుబలి మొదటి భాగం కన్నా బాగా, గొప్పగా తీసిన సినిమా.

రేపటి నుంచి ఈ సినిమా రికార్డుల గురించి మనం మాట్లాడుకుంటూనే ఉండాలి అంతే.మనం గర్వించే సినిమా .ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తెలుగు సినిమా.

ప్లస్ పాయింట్స్ :

* రాజమౌళి టేకింగ్

* టైటిల్స్, ప్రభాస్ ఎంట్రీ

* బాహుబలి – దేవసేన ఎపిసోడ్లు, హంసనావ

* ఇంటర్వల్ ఎపిసోడ్

* కటప్ప బాహుబలిని చంపే సీన్.

* మొదటిభాగాన్ని మించిన భావోద్వాగాలు

మైనస్ పాయింట్స్ :

* కొన్నిచోట్ల గ్రాఫిక్స్ వర్క్

* సత్యరాజ్, సుబ్బరాజు సన్నివేశాలు కొన్ని

* ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ కొద్దిగా తేలిపోతుంది

చివరగా :

సాహోరే రాజమౌళి .జై హారతి నీకే పట్టాలి.

తెలుగు స్టాప్ రేటింగ్ :4/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube