జగన్ అనుకున్న మేరకు కొత్త మంత్రివర్గం కొలువు తీరింది.ఎవరూ ఊహించని వారికి సామాజిక వర్గాల వారీగా ప్రాధాన్యాన్ని జగన్ కల్పించారు.
ఇంకా మంత్రి పదవులు ఆశించి భంగపడిన వారు, అసంతృప్తి తో ఉన్న పార్టీ సీనియర్ నాయకుల ద్వారా వారిని బుజ్జగించే ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశారు.కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచి జగన్ వారిని పూర్తి స్థాయిలో రంగంలోకి దించారు.
మంత్రుల శాఖల పై పట్టు సాధించే విధంగా చర్యలు చేపట్టారు.దీనిలో భాగంగానే విద్యా వైద్య శాఖ లపై జగన్ సమీక్ష చేపట్టారు.
విద్య, వైద్యం ప్రభుత్వ రంగం ద్వారా మెరుగ్గా ప్రజలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న జగన్ ఈ మేరకు ఈ శాఖలపై దృష్టి ఎక్కువగా పెడుతున్నారు.
మంగళవారం వైద్య శాఖ పై ఆ శాఖ మంత్రి విడుదల రజిని ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా వైద్య శాఖలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, కొత్త పోస్టుల భర్తీ , మెడికల్ కాలేజీ ల నిర్మాణం , కొత్త కాలేజీలకు అనుమతులు, ఆస్పత్రులలో జరుగుతున్న నాడు-నేడు కార్యక్రమంపై పురోగతి, విలేజ్ హెల్త్ క్లినిక్ వంటి వాటిపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.ఇక తర్వాత ప్రభుత్వ ప్రాధాన్యత ఏమిటో విడుదల రజిని కి జగన్ అవగాహన కల్పించారు.
అలాగే బుధవారం విద్యాశాఖ పైన జగన్ సమీక్ష నిర్వహించారు.ఆ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బొత్స సత్యనారాయణ , ఉన్నతాధికారులతో విద్యా శాఖ కు సంబంధించిన అన్ని వ్యవహారాల పైన చర్చించారు.

పాఠశాలల ఆధునీకరణలో భాగంగా జరుగుతున్న నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియం, ఈ ఏడాది నుంచి 8వ తరగతి పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అమలు చేయడం, ప్రతి మండలానికి రెండు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండేలా చర్యలు చేపట్టడం, విద్యా కానుక అదనపు తరగతి గదుల నిర్మాణం, ఇలా అనేక అంశాలపై జగన్ సమీక్ష నిర్వహించి మంత్రులకు ఈ శాఖలపై తాను ఎంతగా దృష్టి పెడుతున్నానో మీరూ అంతకంటే ఎక్కువ కష్టపడాలి అనే సంకేతాలు జగన్ ఇచ్చారు.వీలైనంత తొందరగా ఈ శాఖపై పట్టు సాధించి ప్రజల్లో ప్రభుత్వ పరపతిని పెంచాలనే సంకేతాలను జగన్ ఇచ్చారు.