ఏపీలో బిజెపిని ( BJP ) ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి అనే విషయంలో అటు రాష్ట్ర బిజెపి నేతలతో పాటు, కేంద్ర బీజేపీ పెద్దలు గందరగోళానికి గురవుతున్నారు.ఎప్పటి నుంచో పార్టీని ఏపీలో బలోపేతం చేయాలని చూస్తున్నా.
అది సాధ్యపడటం లేదు.ఒంటరిగా వెళితే కనీస ప్రభావం చూపించలేమని భావిస్తూ, ఎప్పుడు ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటూనే బిజెపి వస్తోంది.
కానీ 2019 ఎన్నికల్లో బిజెపి ఒంటరిగా పోటీ చేసి నోటా కంటే తక్కువ ఓట్లను సాధించి, అభాసుపాలు అయింది.దీంతో ఎన్నికల తరువాత జనసేన పార్టీతో( Janasena ) బిజెపి పొత్తు పెట్టుకుంది.
కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు రెండు పార్టీల మధ్య సఖ్యత లేదు.ఎవరికి వారు విడివిడిగానే కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఏ విషయంలోనూ ఒకరినొకరు సమర్ధించుకునే పరిస్థితి అంతంత మాత్రమే అన్నట్టుగా ఉంది.ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో బిజెపి , జనసేన కలిసి ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ కనిపించడం లేదు.దీనికి తగ్గట్లుగానే ఏపీలో 175 నియోజకవర్గాలకు గాను 147 నియోజకవర్గాలకు అసెంబ్లీ కన్వీనర్లను తాజాగా నియమించారు.ఈ నియామకాలతో జనసేనతో బిజెపి పొత్తు తెగ తెంపులు చేసుకుంటుందనే సంకేతాలు వెలబడ్డాయి.
ఇటీవల బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది.ఈ సందర్భంగా జనసేనతో పొత్తు వ్యవహారంపై చర్చకు రాగా, మెజారిటీ నేతలు జనసేన తమకు ఏమాత్రం సహకరించడం లేదని సమావేశంలో చెప్పారు.
ఇక ఇప్పుడు అసెంబ్లీ కన్వీనర్ల నియామకం చేపట్టడం ద్వారా బిజెపి సరికొత్త వ్యూహానికి తెరతీసింది.
జనసేన కోసం వేచి చూసే కంటే, ముందుగా అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ లను ప్రకటించి, పార్టీని బలోపేతం చేసి ఎన్నికలకు సిద్ధం అవ్వడం మంచిదనే అభిప్రాయంతో బిజెపి నేతలు ఉన్నారట. తమతో జనసేన కలిసి వచ్చినా, రాకపోయినా ఒంటరిగా నైనా ఎన్నికలకు వెళ్దామని ఈ సమావేశంలో పార్టీ కీలక నేత శివప్రకాష్ ( Shiva prakash ) సూచించారట.ప్రస్తుత కన్వీనర్లే రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం కూడా బిజెపిలో జరుగుతోంది.
ఒకవేళ జనసేనతో పొత్తు కొనసాగించే ఉద్దేశమే ఉంటే, ఈ కన్వీనర్ల నియామకం చేపట్టి ఉండేవారు కాదని , అంతే కాకుండా బిజెపి కి అన్ని స్థానాల్లోనూ పోటీ చేసేందుకు అభ్యర్థులు ఉన్నారా అనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ కన్వీనర్ల నియామకంతో ఆ విమర్శలకు చెక్ పెట్టవచ్చనే ఉద్దేశంతో ఈ నియామకాలు చేపట్టారట.