గత కొంతకాలంగా తెలంగాణపై బీజేపీ అధిష్టానం పూర్తిస్థాయిలో దృష్టి సారించింది.పదేపదే కేంద్ర మంత్రులు, బిజెపి అగ్ర నేతలు తెలంగాణలో పర్యటనలు ,సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఏ చిన్న అవకాశం దొరికినా తెలంగాణకు క్యూ కట్టేందుకు సిద్ధమైపోతున్నారు.ఏదోరకంగా తెలంగాణలో అధికారంలోకి బిజెపిని తీసుకురావాలనే లక్ష్యంతో బిజెపి అగ్ర నాయకులు ఉండడంతో , తెలంగాణ బిజెపి నాయకులను ఆ విధంగానే ప్రోత్సహిస్తూ వస్తున్నారు .టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడ్డుకునేందుకు, ఇరుకున పెట్టేందుకు అవసరమైన వ్యూహాలను అందిస్తున్నారు.టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ బీఆర్ఎస్ అనే జాతీయ పార్టీని స్థాపించి బిజెపికి సవాల్ విసిరేందుకు సిద్ధమవుతుండడంతో, కేసీఆర్ ను తెలంగాణలో ఓడించేందుకు బిజెపి కంకణం కట్టుకుంది.
ఇది ఇలా ఉంటే , త్వరలో జరగబోతున్న మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ కు విజయం దక్కకుండా చేసి, అక్కడ బిజెపి జెండాను ఎగరవేయాలనే లక్ష్యంతో బిజెపి అగ్రనేతలు ఉన్నారు.ఈ మేరకు కేంద్ర హోం మంత్రి, బిజెపి అగ్రనేత అమిత్ షాప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఎప్పటికప్పుడు పార్టీ నాయకులను అలర్ట్ చేయడంతో పాటు, ఆ నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సర్వేలు, నివేదికల ద్వారా పరిస్థితులను అంచనా వేస్తున్నారు.

ఇక మునుగోడులో కాంగ్రెస్ టీఆర్ఎస్ బలాబాలాలపై అంచనా వేస్తూ బిజెపి తరఫున చోటుచేసుకుంటున్న లోపాలు, నాయకుల గ్రూపు రాజకీయాలు వంటి అన్ని విషయాల పైన ప్రత్యేకంగా దృష్టి సారించిన నేపథ్యంలో.ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ఏ విధమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలి.? ప్రత్యర్థులను ఏ విధంగా ఇరుకున పెట్టాలనే అంశంపై తగిన సూచనలు చేసేందుకు, సలహాలు ఇచ్చేందుకు బండి సంజయ్ ను ఢిల్లీకి పిలిపించినట్లు సమాచారం.సంజయ్ ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత బిజెపి మరింత దూకుడును మునుగోడులో ప్రదర్శించే అవకాశం కనిపిస్తోంది.