తెలంగాణలో ఈ రోజు కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి.ఒకవైపు మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల హడావుడి జరుగుతుండగా, మరోవైపు కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం పాట పోటీగా ఈ రోజు జాతీయ సమైక్యత దినోత్సవాలను నిర్వహించనున్నాయి.
దీంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయం వేడెక్కింది.అదీ కాకుండా ఈ రోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించబోతుండడంతో మరింత పొలిటికల్ హీట్ పెరిగింది.
తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్, కేంద్ర అధికార పార్టీ బిజెపి పోటా పోటీగా నిర్వహిస్తున్న ఈ రెండు కార్యక్రమాల పై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
ఈరోజు తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో బహిరంగ సభను నిర్వహిస్తున్నారు.
అలాగే బంజారాహిల్స్ లో కొత్తగా నిర్మించిన బంజారా, ఆదివాసి భవనాలను కేసీఆర్ ప్రారంభించనున్నారు.ఇక తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్ తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా రాజ్ భవన్ వద్ద జాతీయ పతాకాన్నిఎగరవేయనున్నారు.తెలంగాణ విమోచనోధ్యమ పోరాటాలు, త్యాగాలు అనే అంశంపై వక్తృత్వ పోటీలు నిర్వహించనున్నారు.
ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా షెడ్యూల్ పరిశీలిస్తే … ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తో పాటు మరికొంత మంది అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలితారు.

అనంతరం ఎయిర్ పోర్ట్ నుంచి శివరాంపల్లి లో ఉన్న నేషనల్ పోలీస్ అకాడమీకి అమిత్ షా వెళ్లారు.రాత్రి అక్కడే బసు చేశారు .ఈ రోజు కేంద్రం అధికారికంగా నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నారు.ఈరోజు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేయనున్న విమోచన అమృత వేడుకలను ఉద్దేశించి ప్రసంగిస్తారు .అనంతరం హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ నివాసానికి వెళ్తారు.ఈటెల రాజేందర్ తండ్రి మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో రాజేందర్ కుటుంబ సభ్యులను అమిత్ షా పరామర్శించనున్నారు .ఒకేరోజు తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పోటా పోటీగా తెలంగాణలో తెలంగాణ విమోచన, జాతీయ సమైక్యతా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తుండడం ఆసక్తికరంగా మారింది.







