చదువు, ఉద్యోగం, మంచి జీతం వీటన్నింటికీ కేరాఫ్ అడ్రస్ అమెరికా.అందుకే లక్షలాది మంది భారతీయ యువతకు అమెరికాలో చదువు ఓ కల.అయితే కరోనా ప్రభావంతో పరిస్ధితులు మారిపోయాయి.దీనికి తోడు అగ్రరాజ్యంలో ప్రతిరోజూ వేల మంది వైరస్ బారిన పడుతున్నారు.
ఇప్పటికే 92,258 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు.ఇలాంటి అనిశ్చిత పరిస్ధితులు మన విద్యార్ధుల నిర్ణయాన్ని మార్చుకునేలా చేస్తాయని భావించారు నిపుణులు.
కానీ వాటిని పటాపంచలు చేస్తూ… అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికీ అమెరికాయే తమ తొలి ప్రాధాన్యమని రుజువు చేశారు భారతీయులు.
ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఎక్స్చేంజ్ 2019 నివేదిక ప్రకారం.
దాదాపు 2 లక్షల మంది భారతీయ విద్యార్ధులు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.అయితే కాలేజ్ దేఖో వ్యవస్థాపకుడు రాజీవ్ సింగ్ లెక్క ప్రకారం వీరి సంఖ్య 2.5 నుంచి 3 లక్షల మధ్య ఉంటుందని అంచనా.నాణ్యత గల విద్య, మెరుగైన సౌకర్యాల కారణంగా అమెరికా.
విదేశీ విద్యార్ధులకు గమ్యస్థానంగా ఉందని విద్యా నిపుణులు అమితాబ్ జింగాన్ అన్నారు.ప్రస్తుత పరిస్ధితుల దృష్ట్యా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీకి వెళ్లే వారు వారి ప్రవేశాన్ని వాయిదా వేసుకోవచ్చు… కానీ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లకు వెళ్లేవారు తమ నిర్ణయాన్ని మార్చుకోరని ఆయన అభిప్రాయపడ్డారు.
అధిక ఆదాయ కుటుంబాలకు చెందిన విద్యార్ధులు ఇమ్మిగ్రేషన్ అనుభవాల కోసం అమెరికాకు వెళతారని వీరి అధ్యయనంలో తేలింది.

కెనడా కూడా విదేశీ విద్యార్ధులకు ఆకర్షణీయమైన సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ, అమెరికా స్థానాన్ని భర్తీ చేసే స్థాయిలో లేదని కాలేజ్‌ఫై వ్యవస్థాపకుడు ఆదర్శ్ ఖండేల్వాల్ చెప్పారు.దీనికి తోడు అమెరికాలోని విద్యా సంస్థలు విదేశీ విద్యార్ధులకు కల్పించే ఆర్ధిక సాయం తదితర అంశాలు భారతీయులకు గట్టి నమ్మకాన్ని కల్పించాయని ఆదర్శ్ అన్నారు.విదేశాలకు వెళ్లే మొత్తం భారతీయ విద్యార్ధుల్లో అమెరికాకు వెళ్లేవారి శాతం 35గా ఉంది.

ఇదే సమయంలో అన్ని రకాల వీసా నిబంధనల్లో మార్పులు చేసిన ట్రంప్ ప్రభుత్వం హెచ్1, ఎఫ్1 ఎస్‌టీఈఎం కేటగిరీ వీసా సంఖ్యను మాత్రం తగ్గించలేదు.దీనికి తోడు అమెరికాలోని అత్యున్నత విద్యాసంస్థలు విదేశీ విద్యార్ధులు ఎఫ్ 1 ఎస్‌టీఈఎం వీసా ప్రయోజనాన్ని పొందేందుకు గాను వారి కార్యక్రమాలను ఎస్‌టీఈఎం ఎంబీఏలుగా మార్చాయి.అనేక యూనివర్శిటీలు విద్యార్ధులకు ఆన్‌లైన్‌లో క్లాసులు పెట్టకుండా సెమిస్టర్ తేదీలను ముందుకు తీసుకొచ్చాయి.అమెరికా తర్వాత యూకే, కెనడా, ఆస్ట్రేలియాలను భారతీయ విద్యార్ధులు ఎంచుకుంటున్నారు.







