అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఏఏపీఐ) 40వ వార్షిక సమావేశాలు జూన్ 23 నుంచి 26 వరకు జరగనున్నాయి.టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియో ఇందుకు వేదిక కానుంది.
భారత్, అమెరికాలలో సమానమైన ఆరోగ్య అవకాశాలను ఎలా అందించవచ్చో ఈ సమావేశంలో చర్చించనున్నారు.అలాగే వివిధ రంగాలలో నిష్ణాతులైన పలువురు ప్రముఖులను ఈ సందర్భంగా సన్మానించనున్నారు.
ఈ నేపథ్యంలో ఏఏపీఐ అధ్యక్షురాలు డాక్టర్ అనుపమ గొట్టిముక్కల మాట్లాడుతూ.ప్రతి భారతీయుడు గర్వించదగ్గ రీతిలో ఈ సదస్సు జరుగుతుందన్నారు.ఉన్నత చదువులు, పరిశోధనల కోసం తొలినాళ్లలో భారత్ నుంచి అమెరికాకు వెళ్లిన వారు ఎన్నో వివక్షలు ఎదుర్కొన్నారని ఆమె అన్నారు.అలా ఇండియాలో మెడిసిన్ చదివి వచ్చిన వారితో ఏర్పాటైన ఈ సంస్ధ (ఏఏపీఐ) నేడు అమెరికాలోని లక్షలాది మంది వైద్యులకు వెన్నుదన్నుగా నిలుస్తోందని అనుపమ తెలిపారు.
తన హయాంలో 50 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించేలా ఏఏపీఐ… ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువస్తుందని ఆమె స్పష్టం చేశారు.భారత్‌లోని ప్రివెంటీవ్ హెల్త్‌కేర్‌లో భాగంగా అన్ని మెడికల్ కాలేజీలలో ఎమర్జెన్సీ మెడిసిన్, జెరియాట్రిక్స్, ఇతర విభాగాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు అనుపమ తెలిపారు.
భారతదేశంలో మానవ అక్రమ రవాణా కార్యక్రమానికి వ్యతిరేకంగా 75,000 డాలర్లను ఏఏపీఐ విరాళంగా అందించిందని ఆమె చెప్పారు.అలాగే గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం వంద మంది అర్హులైన మహిళలకు వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించినట్లు అనుపమ గుర్తుచేశారు.
దీనితో పాటు రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమంలో భాగంగా సౌత్ చికాగోలో ఉచితంగా మామోగ్రామ్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.కోవిడ్ మహమ్మారి కాలంలో భారత్, అమెరికాలలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించినట్లు అనుపమ వెల్లడించారు.
బయోకెమికల్ ఎనలైజర్లు, వెంటిలేటర్లు, పల్స్ ఆక్సిమీటర్లు, ఆక్సిజన్ ప్లాంట్లను విరాళంగా అందించినట్లు ఆమె గుర్తుచేశారు.
ఇకపోతే.40వ వార్షిక సమావేశాల్లో పలు రంగాల్లో నిష్ణాతులైన వారిని సన్మానించనున్నట్లు అనుపమ పేర్కొన్నారు.వీరిలో టెక్సాస్ గ్రూప్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సౌజన్య మోహన్, ప్రైమ్ హెల్త్‌కేర్ సీఈవో డాక్టర్ ప్రేమ్ కుమార్ రెడ్డి, క్రికెట్ దిగ్గజం డాక్టర్ సునీల్ గవాస్కర్, ప్రముఖ శాస్త్రవేత్త పీటర్ జే హోటెజ్, అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ఎలెక్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ జాక్ రెస్‌నెక్ , నేషనల్ డ్రగ్ కంట్రోల్ పాలసీ డైరెక్టర్ డా.రాహుల్ గుప్తా, అష్టాంగ యోగా పరమ గురువు ఆర్.శరత్ జోయిస్, సాధ్వి సరస్వతి భగవతి వున్నారు.