మతం వేరు.చట్టంవేరు.
మతం కరెక్టు అని చెప్పేది చట్టం రాంగ్ అని చెబుతుంది.స్వచ్ఛందంగా చనిపోవడం ఒక మతంలో సంప్రదాయం, ఆచారం.
కాని స్వచ్ఛందంగా చనిపోవడాన్ని చట్టం ఆత్మహత్య అంటుంది.అది నేరమని చెబుతుంది.
ఈ వివాదం జైన మతానికి సంబంధించింది.జైన మతంలో ‘సంతారా’ అనే సంప్రదాయం లేదా ఆచారం ఉంది.
ఎవరైనా చనిపోవాలనుకుంటే అన్నం, నీరు తీసుకోవడం మానేసి మరణాన్ని ఆహ్వానిస్తారు.ఇదో ప్రక్రియ.
జైన మతస్తులు అనేకమంది ఈ విధంగా ప్రాణాలు వదిలారు.అయితే ఇది బలవన్మరణమని, ఆత్మహత్య కిందకు వస్తుందని, కాబట్టి దీన్ని నేరంగా పరిగణించాలని గత నెలలో రాజస్థాన్ హైకోర్టు తీర్పు చెప్పింది.
అయితే ఈ తీర్పును జైనులు నిరసించారు.గత వారం వేలాదిమంది జూన మతస్తులు రాజస్థాన్‌లో భారీ ప్రదర్శన నిర్వహించారు.‘ఆత్మహత్య నేరం….కాని సంతారా మతాచారం’ అని నినదించారు.
జీవితం మీద విరక్తి చెందిన జైనులు అన్నం, నీరు మానేసి ప్రాణాలు వదలడాన్ని కోర్టులు నేరంగా పరిగణించకూడదన్నారు.అయితే ఈ విధంగా రోజుకు ఎంతమంది చనిపోతున్నారో తెలియదు.
జైన సంప్రదాయాన్ని నేరమని చెప్పిన హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఓ వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాడు.దీన్ని విచారించిన సర్వోన్నత న్యాయస్థానం మతాన్ని సమర్ధించింది.
ఈ సంప్రదాయాన్ని కొనసాగించవచ్చని తీర్పు ఇచ్చింది.కోర్టులు సాధారణంగా మతం విషయంలో కల్పించుకోవు.
మతానికి సంబంధించిన విషయాలు చాలా సున్నితంగా ఉంటాయి.మత పరమైన అంశాలకు శాస్ర్తీయమైన ఆధారాలు లేకపోయినా ఇది ప్రజల విశ్వాసానికి సంబంధించిన వ్యవహారం.
ఏ కొద్ది వ్యతిరేకతను కూడా మతపరమైన విశ్వాసాలు ఉన్నవారు సహించలేరు.కొన్ని మతాలు మరీ రిజిడ్‌గా, సవరణలు చేయడానికి ఇష్టపడనివిగా ఉంటాయి.
కాబట్టి వాటిని మార్చుకోవాలని కోర్టులు కూడా ఒత్తిడి చేయవు.ప్రస్తుతం జైన మతానికి సంబంధించిన వివాదం కూడా అటువంటిదే.
ఒకప్పుడు భూదాన యజ్ఞం పేరుతో పెద్ద ఉద్యమం నడిపిన వినోబా భావే కూడా అన్నం, నీరు ముట్టకుండా ప్రాణాలు వదిలారు.తెలుగు రాష్ర్టం కోసం పొట్టి శ్రీరాములు కూడా ఇలాగే ప్రాణ త్యాగం చేశారు.
మొదటిది ఆధ్యాత్మికపరమైంది.రెండోది నిరాహారదీక్ష.
ఇది రాజకీయపరమైంది.







