సర్వేలు చేయించడం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అలవాటు.ఏదో ఒక విషయం తెలుసుకోవడానికి సర్వే చేయిస్తుంటారు.
అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఒకే ఒక్క రోజులో తెలంగాణ వ్యాప్తంగా బృహత్తర సర్వే చేయించి ‘రికార్డు’ సృష్టించారు.ప్రపంచంలో ఇలాంటి సర్వే ఎవ్వరూ చేయలేదని ప్రచారం చేశారు.
మరి ఈ సర్వే ప్రజలకు ఎంతమేరకు ప్రయోజనం కలిగిందో, ఏం వివరాలు తెలుసుకున్నారో తెలియదు.ఆ తరువాత మరో రెండు మూడు సర్వేలు కూడా చేశారు.
తాజాగా మరో సర్వే చేయించాలని నిర్ణయించారు.ఇది ఎస్సీ, ఎస్టీలకు గత ప్రభుత్వాలు సాగు కోసం ఇచ్చిన భూములకు సంబంధించింది.
ఉమ్మడి రాష్ర్టంలో ప్రభుత్వాలు పేద ఎస్సీ, ఎస్టీలకు వ్యవసాయం చేసుకునేందుకు భూములు పంపిణీ చేశాయి.అయితే చాలా జిల్లాల్లో సాగుకు పనికిరాని భూములు ఇచ్చారు.
అంటే రాళ్లూరప్పలతో కూడా భూములన్నమాట.ఇలాంటి భూముల్లో సేద్యం ఎలా చేయాలని గగ్గోలు పెడితే భూమి అభివృద్ధి పథకం అనే పేరుతో పనికిరాని భూములను సాగు యోగ్యంగా చేశారు.
ఇది ఎంత సరిగ్గా అమలు జరిగిందో తెలియదు.అయితే ఉమ్మడి రాష్ర్టంలో ప్రభుత్వాలు ఇచ్చిన చాలా భూములు ఇప్పటికీ వృథాగా పడి ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి వచ్చింది.
దీంతో ఈ భూములపై సర్వే చేయించాలని నిర్ణయించుకున్నారు.ప్రస్తుతం ఈ భూముల పరిస్థితి ఏమిటి? ఇవి ఏ ప్రాంతాల్లో ఉన్నాయి? సాగు నీరు యోగ్యత ఏమిటి? అసలు వ్యవసాయానికి పనికొస్తాయా? మొదలైన వివరాలు తెలుసుకోవడానికి సర్వే చేయిస్తారట.ఎస్సీ, ఎస్టీల భూముల అభివృద్ధికి అన్ని చర్యలూ తీసుకుంటామన్నారు.సర్వే చేయించడం మంచిదేగాని ఆ తరువాత పని కూడా చేయాలి.కేసీఆర్ పాలనలో అనేక వాగ్దానాలు కార్యరూపం దాల్చడంలేదనే విమర్శలు వస్తున్నాయి.ఇది మాటల ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటోంది.
వాగ్దానాలు నెరవేర్చలేకపోవడంతో కేసీఆర్ కొన్ని జిల్లాలకు పోయేందుకు కూడా భయపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.భయపడకుండా మాటలు చెప్పడం కాదు…భయపడకుండా ప్రజల మధ్య తిరిగే పరిస్థితి ఉండాలి.







