కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతిజ్ఞ చేశారంటే పాఠ్య పుస్తకాల్లో ఉండే ‘భారత దేశము నా మాతృభూమి…భారతీయులందరూ నా సహోదరులు’ అనే ప్రతిజ్ఞ చేశారని అర్థం కాదు.పార్లమెంటు సమావేశాల్లో వివాదాస్పద భూ సేకరణ బిల్లును పాస్ కానివ్వబోమని ఆయన ప్రతిజ్ఞ చేశారు.
త్వరలో ప్రారంభం కాబోయే వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం భూ సేకరణ బిల్లు మరోసారి ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది.ప్రభుత్వం ప్రవేశపెట్టే ఆ బిల్లును తమ పార్టీ ఓడగొడుతుందని చెప్పారు.ప్రధాని నరేంద్ర మోదీపై వ్యంగ్య బాణాలు వేశారు.‘మోదీ యాభైఆరు ఇంచుల ఛాతీని ప్రజలు ఆరు నెలల్లో ఐదు పాయింట్ ఆరు ఇంచుకలు కుదించారు’ అని రాహుల్ అన్నారు.రాజస్థాన్‌లో ఉన్నది వసుంధర రాజె ప్రభుత్వం కాదని, అది లలిత్ మోదీ సర్కారు అని ఎద్దేవా చేశారు.వసుంధర ప్రభుత్వాన్ని స్వాతంత్ర్యానికి పూర్వం మన దేశంలో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వంతో పోల్చారు.
ఇలా ఎందుకు పోల్చారంటే ఆనాడు మన దేశంలోని బ్రిటిష్ ప్రభుత్వం లండన్‌లో ఉన్న ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకునేది.అదే పద్ధతిలో ప్రస్తుతం వసుంధర రాజె ప్రభుత్వం లండన్‌లో ఉంటున్న ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ చెప్పినట్లు నడుచుకుంటోందని వ్యగ్యంగా అన్నారు.
ఒకప్పుడు నోరు విప్పి ఎక్కువగా మాట్లాడని రాహుల్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని, భాజపా నేతృత్వంలో ఉన్న రాష్ర్ట ప్రభుత్వాలను బాగా దుయ్యబడుతున్నారు.మాటలు నేర్వని వాడు రాజకీయ నాయకుడిగా పనికిరాడు కదా….!
.