ఇది అత్యంత భక్తిపరుడైన తెలుగు రాష్ర్టాల ఉమ్మడి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆహ్వానం.ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి పుష్కరాలు ప్రారంభమవుతున్న సంగతి తెలుసు.
పన్నెండేళ్లకు ఒకసారి మాత్రమే వచ్చే పుష్కరాలను ఆస్తికులైనవారంతా పవిత్రంగా భావిస్తారు.స్వర్గస్తులైన పెద్దలకు పుష్కరాల్లో తర్పణాలు వదిలితే, శ్రాద్ధ కర్మలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని చెబుతారు.
ఇంతటి పవిత్ర పుష్కరాలకు సామాన్యులే కదా పలు రంగాలకు చెందిన పెద్దలూ వెళతారు.మరి గవర్నర్ పోకుండా ఉంటారా? చంద్రబాబు నాయుడు ఆదివారం స్వయంగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను ఆహ్వానించారు.సీఎం వెంట మంత్రి దేవినేని ఉమ కూడా ఉన్నారు.బాబు ఆహ్వానానికి గవర్నర్ సంతోషించారు.పద్నాలుగో తేదీగాని, పదిహేనో తేదీగాని వస్తానని చెప్పారు.గవర్నర్ రెండు రాష్ర్టాల్లోనూ పుష్కరాల్లో పాల్గొనాలి.
రాష్ర్ట విభజన జరిగిన తరువాత ఇవి తొలి పుష్కరాలు.గోదావరి పుష్కరాలకు రెండు ప్రభుత్వాలు పోటాపోటీగా ఏర్పాట్లు చేశాయి.
పుష్కరాలు జరిగే జిల్లాల కలెక్టర్లు చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు.రెండు రాష్ర్టాల్లోనూ మంత్రులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
పుష్కరాలు బ్రహ్మాండంగా నిర్వహించామని ప్రచారం చేసుకోవడానికి ఇద్దరు చంద్రులూ పోటీ పడుతున్నారు.కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
తెలంగాణలో దాదాపు ఎనిమిది కోట్ల మంది పుష్కరాల్లో పాల్గొంటారని చెబుతుండగా, ఆంధ్రాలో సుమారు నాలుగు కోట్ల మందని అంటున్నారు.ఈ ఆధ్యాత్మిక సంరంభం కూడా పాలక పార్టీలకు ఎన్నికల్లో ప్రచారాంశం అవుతుంది.







