తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాదించడం, టీడీపీ ఓడిపోవడంతోపాటు రేవంత్ ముడుపుల వ్యవహారంతో పరువు కూడా పోవడంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చిర్రెత్తుకొస్తోంది.అందుకే ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రహస్య బ్యాలెట్ ఎందుకు? అని ప్రశ్నించారు.ఈ ఎన్నికలను దామాషా విధానంలో అంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ పద్ధతిలో నిర్వమించాలని అన్నారు.ఈ విషయాన్ని తాను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతానని చెప్పారు.ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు రహస్య ఓటింగ్ విధానంలో జరుగుతున్న సంగతి తెలిసిందే.రహస్య ఓటింగ్ విధానం అవసరం లేదన్నారు.
రాజ్యసభ ఎన్నికలు దామాషా విధానంలో జరుగుతున్నాయని, అదే పద్థతిలో కౌన్సిల్ ఎన్నికలు జరపాలని అన్నారు.దామాషా విధానంలో అవకతవకలను, అవినీతిని నివారించే అవకాశం ఉంటుందన్నారు.
టీఆర్‌ఎస్ తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని ఎప్పటిమాదిరిగానే ఆరోపించారు.జగన్ పార్టీకి తనను విమర్శించే హక్కు లేదన్నారు.
పదహారు కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి తనను విమర్శించడమేమిటని ప్రశ్నించారు.మొత్తం మీద చంద్రబాబు నాయుడు రేవంత్ ఉదంతం తరువాత చాలా ఆందోళనగా ఉన్నారు.
తనను నిందితుడిగా టీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నా తాను నిజాయితీపరుడినని గట్టిగా చెబుతున్నారు.తప్పంతా టీఆర్‌ఎస్‌దేనని అంటున్నారు.
కాని రేవంత్ తప్పు చేశాడని ఇప్పటివరకూ ఒక్క ముక్క కూడా అనలేదు.అందుకు ఆయన అహం (ఇగో) అడ్డు వస్తున్నట్లుగా ఉంది.







