జర్మనీకి( Germany ) చెందిన ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు దుమారం రేపుతోంది.భారతీయులు( Indians ) ఎవరైనా చనిపోతే “ఎక్స్‌పైర్డ్” ( Expired ) అనే పదం వాడుతుండటంపై ఆమె నవ్వడం, ఎగతాళి చేయడంతో నెటిజన్లు మండిపడుతున్నారు.
ఆమె తీరును తప్పుబడుతూ సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు.
ఆ వీడియోలో ఆమె చాలా వింతగా, అయోమయంగా మాట్లాడింది.“ఇండియా, ఏం జరుగుతోంది? ఎవరైనా చనిపోతే ‘ఎక్స్‌పైర్డ్’ అనే పదం ఎందుకు వాడుతున్నారు?” అంటూ నవ్వడం మొదలుపెట్టింది.అందరూ ఇలాగే మాట్లాడతారా లేక తనకు తెలిసిన వాళ్లు మాత్రమేనా అని అనుమానం వ్యక్తం చేసింది.
తను మొదటిసారి ఈ పదం ఎక్కడ విన్నదో కూడా చెప్పింది.“ఒక రెస్టారెంట్‌లో స్నేహితులతో ఉండగా ఒక మహిళ ‘ఆవిడ ఎక్స్‌పైర్ అయ్యారు’ అని చెప్పింది.దాంతో నాకు దిమ్మతిరిగిపోయింది.‘ఎక్స్‌పైర్ అయ్యారా? అంటే చనిపోయారా?’ అని అడిగాను” అని చెప్పింది.“ఫుడ్ ఎక్స్‌పైర్ అవుతుంది, మందులు ఎక్స్‌పైర్ అవుతాయి.కానీ మనిషి కూడా ఎక్స్‌పైర్ అవుతారా?” అంటూ ఆమె ప్రశ్నించింది.
వీడియో కింద “నేను ఎవరినీ జడ్జ్ చేయట్లేదు” అని క్యాప్షన్ పెట్టినా, చాలా మంది భారతీయులు ఆమె వ్యాఖ్యలను తప్పుగా భావించారు.సోషల్ మీడియా యూజర్లు ఇన్‌ఫ్లుయెన్సర్‌కు గట్టిగా బుద్ధి చెప్పారు.ఒక యూజర్ కామెంట్ చేస్తూ “నువ్వు మళ్లీ స్కూల్‌కి వెళ్లు! నీకు పదాలు సరిగ్గా తెలీదు.భారతీయుడు నీకు కొత్త పదం నేర్పించినందుకు సంతోషంగా ఉంది” అని ఘాటుగా రిప్లై ఇచ్చాడు.
మరో యూజర్ వివరణ ఇస్తూ, “‘ఎక్స్‌పైర్డ్’ అనేది హాస్పిటల్స్‌లో ఎవరైనా చనిపోతే వాడే మెడికల్ టర్మ్” అని తెలిపాడు.ఇంకొకరు జోక్ చేస్తూ “నవ్వడం ఆపు.నీ ఫాలోవర్లు ఎక్స్‌పైర్ అయిపోతారు.” అంటూ పంచ్ వేశారు.
ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ @The_Induflencer అనే పేరుతో ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్‌లో ఫేమస్ అయింది.ఆమె సాధారణంగా భారతదేశాన్ని పొగుడుతూ వీడియోలు చేస్తుంది.భారతీయ సంస్కృతి, ఆహారం, సంప్రదాయాలు, దుస్తులు గురించి వీడియోలు పెడుతుంది.అంతేకాదు, భారతీయులతో మరింత బాగా మాట్లాడటానికి హిందీ కూడా నేర్చుకుంటుంది.
అయితే, ఆమె చేసిన ఈ వీడియో మాత్రం చాలా మందికి నచ్చలేదు.సంస్కృతులను గౌరవించే బదులు, భారతీయ ఇంగ్లీష్‌ని ఎగతాళి చేసిందని నెటిజన్లు మండిపడుతున్నారు.