యాదాద్రి భువనగిరి జిల్లా: రైల్వే స్టేషన్ కు ఆనుకొని ఆదాని గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏర్పాటు చేయబోతున్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ( Ambuja cement factory )వల్ల చేనేత పరిశ్రమకు ముప్పు తప్పదని పద్మశాలి సంఘం మండల గౌరవ అధ్యక్షుడు సంగిశెట్టి సుదర్శన్,పట్టణ అధ్యక్షుడు రచ్చ యాదగిరి ఆందోళన వ్యక్తం చేశారు.యాదాద్రి భువనగిరి జిల్లా రామన్న పేట మండల పరిధిలోసిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రతిపాదిత ప్రాంతంలోని గేట్ వద్ద బుధవారం పద్మశాలి సంఘం,చేనేత కార్మిక సంఘం,చేనేత వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామన్నపేట ప్రాంతం ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుందని,రామన్నపేట, బోగారం,ఇంద్రపాలనగరం,వెల్లంకి,సిరిపురం,జనంపల్లి గ్రామాలలో చేనేత వృత్తి చేసుకొని జీవనం సాగించేవారు అధికంగా ఉన్నారన్నారు.
నూలుకు రంగులద్ది,అలుగుచాపడం,ఆరబెట్టడం తదితర పనులన్నీ ఆరుబయటే చేస్తారని,సిమెంటు దుమ్ము గాలిలో లేచి వచ్చి వాటిపై పడితే,వస్త్రం నాణ్యత లోపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికుల ఆరోగ్యాలు కూడా దెబ్బతింటాయని కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయని వాపోయారు.కాలుష్యాన్ని వెదజల్లే ఈ సిమెంట్ పరిశ్రమను నెలకొల్పుటకు అనుమతివ్వద్దని ప్రభుత్వాన్ని కోరారు.
ఎట్టి పరిస్థితులలో ఈ పరిశ్రమను నెలకొల్పకుండా అడ్డుకుంటామని,ఈనెల 23న నిర్వహించే ప్రజాభిప్రాయ వేదికకు తరలివచ్చి ముక్తకంఠంతో వ్యతిరేకిస్తామని పేర్కొన్నారు.అనంతరం స్థానిక తహసిల్దార్ లాల్ బహదూర్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో సిరిపురం గ్రామ మాజీ సర్పంచ్ అప్పం లక్ష్మీనర్సు, పద్మశాలి సంఘం నాయకులు జెల్లా శ్రీనివాస్,కైరంకొండ నాగభూషణం,పున్న వెంకటేశం,జెల్లా వెంకటేష్, గంజి చంద్రయ్య, మహేశ్వరం అశోక్,గంజి అశోక్,చలమల్ల రమేష్, అఖిలపక్ష నాయకులు, పర్యావరణ పరిరక్షణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.