మరణం ఎప్పుడు ఏ వైపు నుంచి కబళిస్తుందో తెలియదు.బయటికి వెళ్లిన మనిషి తిరిగి ఇంటికి తిరిగొస్తాడో , రాడో తెలియదు.
నిత్యం ఎన్నో ప్రమాదాలు, సవాళ్ల మధ్య మనిషి తన జీవితాన్ని కొనసాగించాల్సి ఉంటుంది.తాజాగా అమెరికాలో మరణించిన భారతీయ టెక్కీ మరణం అతని కుటుంబంలో విషాదాన్ని నింపింది.
మోంటానా రాష్ట్రంలోని గ్లేసియర్ నేషనల్ పార్క్‌లో మునిగి 26 ఏళ్ల భారత జాతీయుడు ప్రాణాలు కోల్పోయాడు.మృతుడిని సిద్ధాంత్ విఠల్ పాటిల్‌గా గుర్తించారు.
ఇతను కాలిఫోర్నియా రాష్ట్రం( California )లో ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు.స్నేహితులతో కలిసి గ్లేసియర్ నేషనల్ పార్క్‌లో విహారయాత్రకు వెళ్లగా.
అక్కడ నీటిలో మునిగి సిద్ధాంత్ ప్రాణాలు కోల్పోయినట్లు నేషనల్ పార్క్ సర్వీస్ ఒక ప్రకటనలో తెలిపింది.
అయితే ఈ విషాదం చోటు చేసుకోవడానికి కొన్ని గంటల ముందు గ్లేసియర్ నేషనల్ పార్క్( Glacier National Park ) నుంచే తన తల్లికి సిద్ధాంత్ ఫోన్ చేసినట్లు అతని కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు.తాను మరో ఆరుగురు భారతీయ స్నేహితులతో కలిసి మూడు రోజులు పార్క్‌లో ఉన్నామని, ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నామని తల్లితో చెప్పినట్లు అతని బంధువు ప్రీతేష్ చౌదరి అన్నారు.అలాగే మరణించడానికి రెండు గంటల ముందు కూడా తల్లికి మెసేజ్ చేశాడని ప్రీతేష్ చెప్పారు.
మరో మూడు రోజుల్లో శాన్ జోస్‌కు తిరిగి వెళ్తానని సిద్ధాంత్ అందులో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు.సిద్ధాంత్ తల్లిదండ్రులు ప్రీతి, విఠల్‌లు మహారాష్ట్ర నీటిపారుదల శాఖలో ఇటీవలే పదవీ విరమణ చేశారని.
సిద్ధాంత్ మరణవార్తతో వారు షాక్‌లో ఉన్నారని ప్రీతేష్ వెల్లడించారు.
సిద్ధాంత్( Siddhant Vitthal Patil ) మృతదేహాన్ని గాలించి, భారత్‌కు పంపేందుకు సహకరించాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సహా పలువురు నేతలకు తాము లేఖలు రాసినట్లు ప్రీతేష్ తెలిపారు.పూణేకు చెందిన కేంద్ర మంత్రి మురళీధర్ మోహుల్ సెర్చ్ ఆపరేషన్‌కు సంబంధించిన అప్డేట్ల కోసం విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌తో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన వెల్లడించారు.సిద్ధాంత్ పాటిల్ జూన్ 6న అవలాంచె లేక్ ట్రయిల్‌లో ఓ కొండగట్టుపైకి ట్రెక్కింగ్ చేస్తుండగా అదుపుతప్పి నీటిలోపడి ప్రవాహంలో కొట్టుకుపోయాడు.
సమాచారం అందుకున్న సహాయక బృందాలు హెలికాఫ్టర్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టాయి.అయినప్పటికీ పాటిల్ మృతదేహం లభ్యం కాలేదని వార్తలు వస్తున్నాయి.రాళ్లు, చెట్ల మధ్యలో అతని మృతదేహం చిక్కుకుపోయి ఉండొచ్చని రేంజర్లు అనుమానిస్తున్నారు.అయినప్పటికీ పాటిల్ డెడ్ బాడీ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
ఇందుకోసం డ్రోన్లను సైతం రంగంలోకి దించారు.