సూర్యాపేట జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తంబాకు, గుట్కా తదితర వినాశకర ఉత్పత్తులను నిషేధించినా సూర్యాపేట జిల్లాలో నిషేధిత గుట్కా వ్యాపారం జోరుగా కొనసాగుతుంది.ముఖ్యంగా జిల్లాలోని సూర్యాపేట,కోదాడ, హుజూర్ నగర్,నేరేడుచర్ల, తుంగతుర్తి,తిరుమలగిరి ప్రాంతాల్లో కొందరు బేకరీల మాటున విచ్చలవిడిగా నిషేధిత గుట్కా వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో గుట్కాపై నిషేధం ఎత్తివేయడంతో ఈ దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మే 24,2024 న గుట్కాపై నిషేధం విధిస్తున్నట్లు ఆహార భద్రత రాష్ట్ర కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే.
నిషేధం ఎత్తేసినప్పుడు జరిగిన వ్యాపారం కంటే నిషేధం విధించినప్పుడే ఎక్కువా జరుగుతుందని,గుట్కా దందాను అడ్డుకోవాల్సిన పోలీస్,ఎక్సైక్,ఇతర శాఖల అధికారులు నిషేధం ఉన్న విషయం కూడా మరిచిపోయారా అన్నట్లుగా
మామూళ్ల మత్తులో పడి గుట్కా వ్యాపారులకు చేదోడు వాదోడుగా ఉంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.నిషేధం లేనప్పుడు రూ.10 మాత్రమే ఉన్న ప్యాకెట్ నిషేధం ఉన్నప్పుడు రూ.30,40 అయిందని,ఈ దందాలో ఉండే వారికి గుట్కా నిషేధం ఉంటేనే కాసుల పంట పండుతుందనే విషయం బహిరంగ రహస్యమే.జిల్లాకు హైదరాబాద్, విజయవాడ,మహారాష్ట్ర, కర్ణాటక,ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున గుట్కా దిగుమతి అవుతుందని,ఇన్ని చెక్ పోస్ట్ లు దాటుకొని ఎలా లక్షల సరుకు జిల్లాకు చేరుతుందో జిల్లా అధికార యంత్రాంగానికే తెలియాలి మరి జిల్లా ప్రజలు అంటున్నారు.అందరికీ తెలిసే ఈ గుట్కా వ్యాపారం యధేచ్చగా సాగుతుందని,దీనితో ప్రజలకు అధికారులపై ఉండే నమ్మకం సన్నగిల్లి పోతుందని వాపోతున్నారు.
పట్టణాల్లో తమిళనాడు నుండి వచ్చి స్థిరపడి బేకరీలు నిర్వహించే వారి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో చిన్నచితకా షాపుల వారు తీసుకెళుతూ ఓపెన్ గానే విక్రయాలు సాగిస్తున్నారు.గుట్కా అక్రమ వ్యాపారంతో అధిక లాభాలు రావడంతో కొంతమంది వ్యాపారులు దీన్నే ప్రధాన వ్యాపారంగా ఎంచుకొని లాభాలు గడిస్తున్నారు.
రూ.లక్ష విలువైన గుట్కా కొనుగోలు చేసి మూడు లక్షల వరకు లబ్ధి పొందుతున్నట్లు సమాచారం.
ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై నిషేధిత గుట్కాపై ఉక్కుపాదం మోపి ప్రజల ప్రాణాలు కాపాడాలని,గుట్కా వ్యాపారులకు కొమ్ముకాస్తున్న అధికారులపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ నిఘా ఉంచి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.