రాజన్న సిరిసిల్ల జిల్లా : అధికారులందరూ సమన్వయంతో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను( Group-1 Preliminary Examination) విజయవంతంగా పూర్తి చేసేలా చూడాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.ఈ నెల 9 వ తేదీన నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షపై శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మీటింగ్ హాల్ లో అదనపు కలెక్టర్ పి.
గౌతమి తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు కొనసాగే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు జిల్లాలో 4699 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు.అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా జిల్లాలో 15 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు.కేవలం చీఫ్ సూపరింటెండెంట్ మినహా ఎవరూ పరీక్ష కేంద్రంలోకి మొబైల్ ఫోన్ తీసుకెళ్లవద్దని స్పష్టం చేశారు.
ప్రతి కేంద్రంలో మహిళలు, పురుషులకు వేరువేరుగా తనిఖీ గదులు ఏర్పాటు చేయాలని సూచించారు.పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ, పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్ లను మూసి ఉంచాలని, ఆర్టీసీ అధికారులు అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు నడిపించాలని, సెస్ అధికారులు విద్యుత్ సరఫరాలో లోపం లేకుండా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.
వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పరీక్ష కేంద్రాల వద్ద వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు ఉండాలని సూచించారు.అదేవిధంగా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద మంచినీరు, టాయిలెట్లు సక్రమంగా ఉండేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు.
కంట్రోల్ రూం ఏర్పాటు ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే, జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా నెలకొల్పిన కంట్రోల్ రూమ్ 9398684240 నెంబర్ కు ఫోన్ చేయవచ్చని సూచించారు.ఈ సమావేశంలో సిరిసిల్ల ఆర్డీవో రమేష్, ఆర్సీఓ వడ్లూరి శ్రీనివాస్, డీఆర్డీఓ శేషాద్రి, డీపీఓ వీర బుచ్చయ్య, డీటీఓ లక్ష్మణ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ పంచాక్షరి, ఆర్అండ్ బీ ఈఈ శ్యామ్ సుందర్, పీఆర్ ఈఈ సూర్య ప్రకాష్ పలువురు జిల్లా అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
అభ్యర్థులకు సూచనలు
పరీక్షా సమయానికి గంటన్నర ముందు నుంచే అభ్యర్థుల్ని హాల్లోకి అనుమతిస్తారు.పరీక్షకు అరగంట ముందే గేట్లు మూసివేస్తారు.
అభ్యర్థులు కేవలం చెప్పులు ధరించాలి.బూట్లు వేసుకుని రాకూడదు.
బయోమెట్రిక్ ( Biometric )తప్పనిసరిప్రింటెడ్ హాల్ టిక్కెట్లో అభ్యర్థి ఫోటోగ్రాఫ్, సంతకం స్పష్టంగా ఉన్నప్పుడే అది చెల్లుబాటు అవుతుంది.కాబట్టి లేజర్ ప్రింటర్తో లేదా కలర్ ప్రింటర్తో ఏ4 సైజు కాగితంపై ముద్రించిన హాల్ టిక్కెట్ ని తీసుకోవాలి.
పరీక్షా కేంద్రానికి వచ్చే ముందు ప్రింటెడ్ హాల్ టికెట్లోని నిర్దేశిత స్థలంలో అభ్యర్థి పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అతికించాలి.లేనిపక్షంలో అనుమతించరు.
ఒకవేళ డౌన్లోడ్ చేసిన హాల్ టిక్కెట్లో అస్పష్టమైన ఫోటో ఉన్నట్లయితే, అభ్యర్థి మూడు (3) పాస్పోర్ట్ సైజు ఫోటోలను విధిగా అండర్ టేకింగ్తో పాటు చివరిగా చదువుకున్న విద్యా సంస్థ గెజిటెడ్ అధికారి/ప్రిన్సిపాల్ చేత ధ్రువీకరణతో తీసుకురావాలి (ఫార్మాట్ వెబ్సైట్ https://www.tspsc.gov.in) లో అందుబాటులో ఉంది).లేకుంటే పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.పరీక్ష కేంద్రంలో ప్రవేశించిన అభ్యర్థి నుంచి బయోమెట్రిక్ వేలిముద్రలు సేకరిస్తారు.
ఒకవేళ బయోమెట్రిక్ ఇవ్వకుంటే సదరు అభ్యర్థి జవాబు పత్రం మూల్యాంకనం చేయబోమని కమిషన్ స్పష్టం చేసింది.బయోమెట్రిక్ పూర్తయ్యేవరకు అభ్యర్థులెవరూ పరీక్ష కేంద్రం నుంచి బయటకు వెళ్లడానికి వీల్లేదు.
అభ్యర్థుల సౌకర్యార్థం అరగంట కోసారి బెల్ మోగించి పరీక్ష సమయాన్ని తెలియజేస్తారు.అవసరమైతే ఇన్విజిలేటర్లను అడిగి సమయం తెలుసుకోవచ్చు.
అభ్యర్థులకు వ్యక్తిగత సమాచారం ముద్రించిన ఓఎంఆర్ జవాబుపత్రాన్ని ఇస్తారు.అభ్యర్థులు ఓంఎఆర్, ప్రశ్నపత్రంలో ముద్రించిన నిబంధనలు సూచనలు పాటించాలి.
అభ్యర్థుల సౌకర్యార్థం నమూనా ఓఎంఆర్ పత్రాన్ని కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.ఈ కాపీని వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది.
అందులోని సూచనల ప్రకారం సరైన విధానంలో వివరాలు రాయడంతో పాటు బబ్లింగ్ చేయడాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి.అభ్యర్థులు పరీక్ష ముగిసేవరకు పరీక్ష కేంద్రాన్ని విడిచి వెళ్లకూడదు పరీక్ష ముగిసిన తరువాత ఓఎంఆర్ పత్రాన్ని ఇన్విజిలేటర్కు అప్పగించాలి.
హాల్ టికెట్ పై ముద్రించిన సూచనల కాపీని కూడా కమిషన్ ఇప్పటికే వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.సూచనలు జాగ్రత్తగా చదివి పరీక్ష సమయంలో వాటిని పాటించాలి.
అభ్యర్థులు పొరపాట్లు చేసినా, ఓఎంఆర్, హాల్ టికెట్లలోని నిబంధనలు పాటించకున్నా.కమిషన్ ఎలాంటి బాధ్యత వహించదు.