భార్యను హత్య చేసిన కేసులో భారత సంతతికి చెందిన వ్యక్తికి యూకే కోర్టు 15 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.నిందితుడిని 24 ఏళ్ల సాహిల్ శర్మగా( Sahil Sharma ) గుర్తించారు.
ఇతను తన భార్య మెహక్ శర్మ( Mehak Sharma ) (19)ను హత్య చేసినట్లు నేరాన్ని అంగీకరించాడు.గతేడాది అక్టోబర్‌లో దక్షిణ లండన్‌లోని క్రోయిడాన్‌లోని యాష్ ట్రీ వే వద్ద మెహక్ శర్మ కత్తిపోట్లకు గురయ్యారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా సాహిల్ శర్మను ఘటనాస్థలంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు.
ఫిబ్రవరిలో కింగ్‌స్టన్ క్రౌన్ కోర్టులో( Kingston Crown Court ) మెహక్ శర్మ కేసులో నేరాన్ని అంగీకరించడంతో న్యాయస్థానం శుక్రవారం శిక్ష విధించినట్లు మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు.
మెట్ పోలీస్ స్పెషలిస్ట్ క్రైమ్ కమాండ్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ లారా టెంపుల్ ( Laura Temple )మీడియాతో మాట్లాడుతూ .ఓ కుటుంబాన్ని పూర్తిగా కుదిపేసిన విషాద ఘటనగా అభివర్ణించారు.మెహక్‌ను తిరిగి తీసుకురాలేకపోయినా.ఆమె కుటుంబసభ్యులకు న్యాయస్థానం తీర్పు కొంత ఊరటను కలిగిస్తుందని లారా అభిప్రాయపడ్డారు.

పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లోని( Gurdaspur, Punjab ) జోగి చీమా గ్రామానికి చెందిన మెహక్ శర్మకు గతేడాది జూన్ 24న సాహిల్ శర్మతో వివాహం జరిగింది.పెళ్లయిన ఆరు నెలలకు ఆమె లండన్ వెళ్లగా.ఆ వెంటనే స్పౌజ్ వీసాపై సాహిల్ కూడా యూకేకు వెళ్లాడు.అయితే అక్కడికి వెళ్లిన మరుక్షణం నుంచి సాహిల్ నిజస్వరూపం బయటపడిందని మధుబాల ఆరోపించారు.తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని మెహక్ ఎన్నోసార్లు తనతో చెప్పుకుని బాధపడిందని మృతురాలి తల్లి మధుబాల కన్నీటి పర్యంతమయ్యారు.

ఆ తర్వాత రెండు రోజుల పాటు కూతురి నుంచి ఫోన్ రాకపోవడంతో యూకేలో ఉంటున్న తన బంధువును ఆమె ఇంటికి పంపించానని మధుబాల( Madhubala ) తెలిపారు.ఇంతలో మెహక్ హత్యకు గురైందని లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు సాహిల్‌ను అదుపులోకి తీసుకున్నారని ఆ బంధువు పిడుగులాంటి వార్త చెప్పాడు.ఈ ఘటన మెహక్ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
మెహక్ శర్మ.ఫ్యాబలస్ హోమ్‌కేర్ లిమిటెడ్‌లో కేర్‌టేకర్‌గా పనిచేస్తోంది.
ఇది క్రోయ్‌డాన్ కేంద్రంగా నడుస్తోన్న హోమ్‌కేర్ ప్రొవైడర్.కాంగ్రెస్ నేత వికాస్ సోనీ గతేడాది బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.
విపక్ష నేత పర్తాప్ సింగ్ బజ్వా చొరవ కారణంగా మెహక్ మృతదేహం భారత్‌కు చేరుకుంది.మెహక్ అత్తమామలపై చర్యలు తీసుకునేలా తాను ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు సోనీ తెలిపారు.







