సూర్యాపేట జిల్లా: జిల్లాలో వరుస ఆటో ప్రమాదాలు ప్రజలను వణికిస్తున్నాయి.నెల వ్యవధిలోనే మూడు ఆటో ప్రమాదాలు జరిగి మొత్తం 12 మంది మృతి చెందగా,సుమారు 25 మంది క్షతగాత్రులై ఇంకా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇటీవల మోతె మండల కేంద్రంలో జరిగిన ఆటో ప్రమాదంలో సుమారు ఆరుగురు మరణించగా,ఆరుగురు ఇంకా ట్రీట్మెంట్ లోనే ఉన్నారు.అనంతగిరి మండలానికి చెందిన మరో మహిళా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వద్ద ఆటో ప్రమాదంలోనే మరణించింది.
ఈ నెల 4వ తేదీన సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన ఆటో ప్రమాదంలో ముగ్గురు మరణించగా,ఇప్పుడు చికిత్స పొందుతూ మరో ఇద్దరు కన్నుమూశారు.దీనితో మృతుల సంఖ్య ఐదుకు చేరుకుంది.
ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారుల మృతి తీవ్ర విషాదం నింపింది.ఇంకా కొందరు పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తుంది.
ఈ ప్రమాదాల్లో మరణించిన వారిలో ఎక్కువ మంది నిరుపేద కుటుంబాలకు చెందిన వారే కావడం గమనార్హం.అయినా ప్రభుత్వం బాధిత కుటుంబాలను పట్టించుకోలేదని,ఇంత వరకు ఎక్స్ గ్రేషియా ప్రకటించలేదని బాధిత కుటుంబాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు రావాలన్నా, పంటల సీజన్ లో కూలీ పనులకు వెళ్లాలన్నా ఆటోల పైనే ఆధారపడాల్సి వస్తుందని,కానీ,వరుసగా ఆటోలు ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు గాల్లో కలిసిపోతుండడంతో ప్రజల్లో తీవ్రమైన అలజడి నెలకొందని అంటున్నారు.
ఆటో ప్రమాదాలకు అధికారుల పర్యవేక్షణ లేకపోవడం కూడా కారణంగా భావిస్తున్నారు.
ఆటో డ్రైవర్లకు సరైన అవగాహన లేకపోవడంతో కెపాసిటీకి నుంచి ప్యాసింజర్లను ఎక్కించుకోడంతో ఇలాంటి విషాద ఘటనలు పునరావృతమవుతున్నాయని అంటున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆటో ప్రమాదాలపై సీరియస్ గా చర్యలు చేపట్టి ప్రమాదాలు జరగకుండా చూడాలని,వెంటనే ఆటో ప్రమాద బాధితులకు ఎక్స్గ్రేషియా చెల్లించి, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నారు.