సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండల ( Garidepally Mandal )కేంద్రం నుండి కల్మల్ చెరువు వెళ్ళే రహదారిపై గారకుంట తండా వద్ద ఎన్ఎస్పీ కాల్వపై పురాతన కల్వర్టులు శిథిలావస్థకు చేరి ప్రమాదాలకు నిలయాలుగా మారాయని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.మోరీలు సక్రమంగా లేక,కాల్వకు ఇరువైపులా కల్వర్టులు కుంగి గుంతలు పడి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కనీసం డేంజర్ జోన్( Danger zone ) గా ఉన్న కల్వర్తుల వద్ద ఎటువంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో రాత్రివేళలో వాహనదారులు దగ్గరికి వచ్చే వరకు కూడా లోతైన గుంత ఉందని తెలియకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని,రహదారిపై నుండి కలువలోకి వాహనాలు పడిపోయిన ఘటనలు కూడా ఉన్నాయని అంటున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నూతన వంతెన నిర్మాణం చేసి,ప్రమాదాలను అరికట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు.