నల్గొండ జిల్లా:దేవరకొండ( Devarakonda ) ప్రాంతీయ వైద్యశాలలో ఓపి పక్రియను ఆన్లైన్ లో పెట్టడం రోగులకు శాపంగా మారింది.అసలే వేసవికాలం కావడంతో సుదూర ప్రాంతాలైన పోగిల్ల, కసారజుపల్లి,కంబాలపల్లి నుండి వచ్చి ప్రైవేట్ హాస్పిటల్స్( Private Hospitals ) లో చూపించుకోలేక ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయిస్తే ఆన్లైన్లో ఓపి పెట్టడం ద్వారా గంటల తరబడి లైన్లో వేచి ఉండే పరిస్థితి వచ్చిందని రోగులు వాపోతున్నారు.
ఆన్లైన్ ఓపి( Online Op ) ఉండడం వలన ఎదురు చూపులు తప్పడం లేదని,బస్సులు,ఆటోల సౌకర్యం లేకపోయినా ఇబ్బందులు పడుతూ సమయానికి వచ్చి ఓపి రాయించుకున్న వృద్ధులు, వికలాంగులు గంటల తరబడి లైన్లో వేచి చూడడం వల్ల ఉన్న రోగం సంగతి దేవుడెరుగు కొత్త రోగం వచ్చేలా ఉందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.రోగులు గంటల తరబడి ఓపి కోసం లైన్లో ఉండగానే డాక్టర్లు మాత్రం సమయపాలన పాటిస్తూ వారి సమయం కాగానే ఓపిలన్నీ వదిలేసి తమతమ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు పర్యవేక్షించి వచ్చిన రోగులకు తక్షణమే వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.