సూర్యాపేట జిల్లా: మీడియా రంగాన్ని కేంద్ర ప్రభుత్వం నానాటికి నిర్వీర్యం చేస్తున్నదని, జర్నలిస్టుల పట్ల కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరిని విడనాడాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐజేయు అనుబంధం) సూర్యాపేట జిల్లా కార్యదర్శి డాక్టర్ బంటు కృష్ణ అన్నారు.టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం జర్నలిస్ట్ షాహిద్ భగత్ సింగ్,శివరాం రాజ గురు,సుఖదేవ్ థాపర్ లు అమరత్వం పొందిన సందర్భంగా వారి వర్ధంతి ని పురస్కరించుకొని చేపట్టిన దేశవ్యాప్త ఆందోళన,నిరసన కార్యక్రమాల డిమాండ్స్ డే పిలుపులో భాగంగా సూర్యపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం క్రాస్ రోడ్డు అంబేద్కర్ విగ్రహం వద్ద జర్నలిస్టులు ఆందోళన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు.ఈ సందర్భంగా బంటు కృష్ణ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం విషయంలో కేంద్రం ద్వంద వైఖరిని ప్రదర్శిస్తుందని ఆరోపించారు.ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్న జర్నలిస్టులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సామాన్యులు,పేద ప్రజల పట్ల అనేక కథనాలు రాసి సమస్యలను పరిష్కరించడంలో సాయం అందిస్తున్న జర్నలిస్టులు నిత్యం సమస్యల సుడిగుండంలో కాలిపోతున్నారని వాపోయారు.బ్రిటీష్ పాలన నుండి దాస్య శృంఖలాలను తెంచి దేశానికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు అందించాలనే తపన, కసితో తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా భావించి,
బ్రిటీష్ అధికారులను ఎదిరించి పార్లమెంటులోనే బాంబులు వేసి, ప్రాణాలను బలిపెట్టి అసువులు బాసి అమరత్వం పొందిన భగత్ సింగ్,రాజగురు,సుఖదేవు లు స్వేచ్ఛ కోసం చేసిన త్యాగం నేటికీ,ఏనాటికి మరువరానిదని కొనియాడారు.
స్వాతంత్రం పొంది స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నా ఇంకా జర్నలిస్టులు సంక్షేమం, హక్కుల విషయంలో కేంద్రంతో కొట్లాడాల్సి రావడం మీడియా రంగం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత ధోరణికి నిదర్శనమన్నారు.ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల సానుకూలంగా స్పందించి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే(ఐజేయు) ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు బత్తుల మల్లికార్జున్,ప్రధాన కార్యదర్శి రెబ్బ విజయకుమార్,జిల్లా ప్రెస్ క్లబ్ కోశాధికారి తల్లాడ చందన్,జిల్లా ఉపాధ్యక్షుడు దేవరశెట్టి వేణుమాధవ్,వల్లపట్ల రవీందర్,షేక్ రషీద్, ఉయ్యాల నరసయ్య,పల్లె మనిబాబు,రమేష్,నజీర్ జహీర్,రామచంద్రరాజు, వల్దాస్ ప్రవీణ్ కుమార్, నకిరేకంటి సైదులు, వెంకటేష్,విక్రమ్ నాయక్, కంఠం గౌడ్,శంకర్ తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి ఆధ్వర్యంలో ధూపాటి శ్యాంబాబు, దుర్గం బాలు,తప్సి అనిల్, చిలుకల చిరంజీవి,ప్రభు కుమార్,వెంకట్ గౌడ్ లు ఈ నిరసన కార్యక్రమానికి హాజరై మద్దతు తెలిపారు.