నల్లగొండ జిల్లా: నాంపల్లి మండలం టీపి గౌరారంలో మూడు రోజుల క్రితం ప్రారంభమైన శ్రీ చలిదోన లక్ష్మీ నరసింహ స్వామి జాతరలో అసౌకర్యాల నడుమ అవస్థలు పడ్డామని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈజాతరకు జిల్లా నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.
శుక్రవారం జరిగిన రథోత్సవానికి గురువారమే భక్తులు కుటుంబ,బంధుమిత్రుల సమేతంగా ఇక్కడికి చేరుకొని రాత్రి నిద్రచేసి, ఉదయాన్నే రథోత్సవాన్ని తిలకించారు.ఇది పూర్వకాలం నుండి ఆనవాయితీగా వస్తుంది.
కొండంత జాతర జరిగే ప్రాంతంలో భక్తుల సౌకర్యార్దం విద్యుత్ లైట్లు కూడా ఏర్పాటు చేయలేదు.దీనితో గురువారం రాత్రి కొండపై భక్తులు చిమ్మచీకట్లో గడపాల్సిన పరిస్థితి నెలకొందని,చుట్టూ అటవీ ప్రాంతం కావడంతో దాహం తీర్చుకోడానికి కనీసం మంచినీటి ఏర్పాట్లు కూడా చేయలేదని,కొండ కింద ఉన్న కోనేటిలో నెలల తరబడి నీళ్లను మార్చకపోవడంతో నాచు పేరుకుపోయిందని,అసలే ఎండాకాలం అందులో నీరు తాగితే తమ పరిస్థితి ఏంటని భక్తులు వాపోయారు.
ఇదిలా ఉంటే ఈ ప్రాంతంలో ఉండే ప్రాజెక్టు కొరకు తిరిగే భారీ వాహనాలతో రోడ్డు పూర్తిగా దుమ్ముతో నిండిపోయి భక్తులకు ఊపిరాడకుండా చేస్తుందని,దుమ్ము లేవకుండా నీళ్లు కొట్టించాల్సిన ప్రాజెక్ట్ యాజమాన్యం ఆ ఆలోచన కూడా చేయలేదని,అయినా దేవాదాయ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంపై భక్తులు మండిపడ్డారు.ఆలయ అధికారులే దగ్గరుండి టెంకాయలను అధిక రేట్లకు విక్రయిస్తున్నారని,ఈ జాతర పేరు మీద లక్షల రూపాయల ఆదాయం వస్తున్నా ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడంలేదని,భక్తులకు కనీస సౌకర్యాలు లేవని,దేవుని సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంత జరుగుతున్నా దేవదాయ శాఖ అధికారులు మాత్రం చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.రాబోయే జాతర నాటికైనా ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు.