సూర్యాపేట జిల్లా:ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని,ఆ దిశగా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలు( Welfare schemes ) అందించేందుకు అహర్నిశలు కృషి చేస్తుందని రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్( Gaddam Prasad Kumar _ అన్నారు.గురువారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని సీతారామస్వామి గుట్ట వద్ద ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ పథకం పునరుద్ధరణ పనులకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలసి శంకుస్థాపన పైలాన్ అవిష్కరించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల అభీష్టం మేరకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పలేనంత అభివృద్ధి చేసిందని,ఆ గొప్పతనం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Redd )కే దక్కుతుందన్నారు.హుజూర్ నగర్,కోదాడ నియోజకవర్గాల్లో చేసిన అభివృద్ధిని ఈ ప్రాంత ప్రజలు ఎన్నటికి మరువరన్నారు.
తుది దశలో ఉన్న ఈ కాలనీ ఆరునెలల్లో పూర్తి చేసి నిరుపేదలకు అందించడం జరుగుతుందని,రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా హుజూర్ నగర్ ఉండబోతుందన్నారు.
అనంతరం రాష్ట్ర నీటి పారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.
ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలే నా బలం,అభివృద్దే నా లక్ష్యమని అన్నారు.గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో లిఫ్టులు, రహదారులు,ఆసుపత్రులు,పరిశ్రమలు చేపట్టామని గుర్తు చేశారు.
పేదలకు అందించే కాలనీ నిర్మాణానికి ఎంతో కృషి చేయడం జరిగిందని, ప్రభుత్వ మార్పుతో గత పదేళ్ళలో పనులు చేపట్టకపోవడం దురదుష్టకరమన్నారు.ఈ ప్రభుత్వం రూ.74.80 కోట్లు మంజూరు చేసిందని,త్వరలో 2160 సింగిల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేసి, అర్హులైన నిరుపేదలకు అందించి హుజూర్ నగర్ లో ఇండ్లు లేని వారు లేకుండా చూస్తామన్నారు.తెల్ల రేషన్ కార్డులు అర్హులైన వారందరికీ త్వరలో అందిస్తామన్నారు.
రాష్ట్ర రెవెన్యూ,హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( Ponguleti Srinivasa Reddy )మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో పట్టణంలో అర్హులైన నిరుపేదలకు 17 లక్షల ఇండ్లను అందించగా బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల్లో 1 లక్ష 12 వేల ఇండ్లు ఇచ్చారని గుర్తు చేశారు.ప్రభుత్వం అధికారంలో రాగానే ముందుగా హుజూర్ నగర్( Huzur Nagar ) లో హౌసింగ్ కాలనీ పరిశీలించి తుది దశలో ఉన్న ఇండ్లకు సత్వరమే రూ.74.80 కోట్లు మంజూరు చేయడం జరిగిందని,7 నెలలో పూర్తి చేసి పేదలకు అందిస్తామన్నారు.రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లను పేదలకు అందించనున్నామని,2008 డిఎస్సీ చేసిన వారికి త్వరలో ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు,ప్రభుత్వం వచ్చిన 90 రోజులలోపు 31 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు.
ధరణి ద్వారా కబ్జా చేసిన విలువైన భూముల లెక్కలను ప్రజల ముందు ఉంచుతామని పేర్కొన్నారు.గత ప్రభుత్వం కమీషన్ల కోసం పడ్డ ఆరాటం అభివృద్ధిపై పెట్టలేదన్నారు.ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీ లను అర్హులైన అందరికి అందిస్తామని,నిజాయితీ, నిబద్ధతతో పాలన అందిస్తున్నామన్నారు.ఈ నియోజక అభివృద్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డితోనే సాధ్యమని స్పష్టం చేశారు.
అంతకు ముందు ఆటో డ్రైవర్లకు దక్షత ఫౌండేషన్ ద్వారా అందించే ఇన్సూరెన్స్ పథకాన్ని కోదాడ,హుజూర్ నగర్ ఆటో డ్రైవర్లకు అందచేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్,ఎస్పీ రాహుల్ హెగ్డే,హౌసింగ్ ఎస్.సి రవీంద్రరావు,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.