క్యారెట్ పంట( Carrot ) శీతాకాలపు పంట.18 నుండి 25 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే వాతావరణంలో క్యారెట్ పంటలు మంచి నాణ్యమైన అధిక దిగుబడి పొందవచ్చు.ఆగస్టు నుండి జనవరి వరకు క్యారెట్ పంటను విత్తుకోవచ్చు.క్యారెట్ పంట విత్తుకునే విధానం, సాగు చేసే విధానంపై అవగాహన కల్పించుకుంటే అధిక పెట్టుబడి వ్యయం తగ్గడంతో పాటు శ్రమ తగ్గి, దిగుబడి పెరుగుతుంది.
క్యారెట్ పంట సాగుకు వదులుగా ఉండే నేలలు, నీరు ఇంకిపోయే సారవంతమైన నేలలు, ఎర్ర నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.బరువైన నల్లరేగడి నేలలు, నీరు నిల్వ ఉండే నేలలు, క్షారత్వం ఎక్కువగా ఉండే నేలలు క్యారెట్ పంట సాగుకు అనుకూలంగా ఉండవు.
క్యారెట్ మొక్కలు ఆరోగ్యకరంగా పెరగాలంటే, వివిధ రకాల తెగుళ్లు, చీడపీడలు ఆశించకుండా ఉండాలంటే, ఒకవేళ ఏవైనా ఆశిస్తే వ్యాప్తి అధికంగా ఉండకూడదు అంటే అది క్యారెట్ పంట విత్తుకునే విధానం పై ఆధారపడి ఉంటుంది.
ఒక ఎకరాకు రెండు కిలోల విత్తనాలు( Carrot Seeds ) అవసరం.విత్తనాలు ముందుగా విత్తన శుద్ధి చేసుకుని విత్తుకుంటే భూమి నుంచి వివిధ రకాల తెగుళ్లు పంటను ఆశించవు.క్యారెట్ మొక్కల మధ్య ఏడు సెంటీమీటర్లు, సాలుల మధ్య 30 సెంటీమీటర్లు దూరం ఉండేటట్లు విత్తుకుంటే మొక్కలకు సూర్యరశ్మితో పాటు గాలి బాగా తగిలి చాలా ఆరోగ్యకరంగా పెరుగుతాయి.
ఎత్తు మట్టి బెడ్లను ఏర్పాటు చేసి, డ్రిప్ ఇరిగేషన్( Drip Irrigation ) ద్వారా క్యారెట్ పంట సాగు చేయడం వల్ల క్యారెట్ దుంప ఎదుగుదల బాగుంటుంది.క్యారెట్ పంటకు తీవ్ర నష్టం కలిగించే దుంప కుళ్ళు చాలావరకు నియంత్రించబడుతుంది.
పంటకు వివిధ రకాల చీడపీడలు( Pests ) ఆశించడానికి దాదాపుగా కలుపు మొక్కలే కీలకపాత్ర పోషిస్తాయి.కలుపు వచ్చాక తీసేయడం కంటే కలుపు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.అంటే పంట విత్తిన 48 గంటల లోపు ఒక ఎకరాకు 1.25లీటర్లు పెండిమిథలిన్ ను ఒక లీటరు నీటిలో కలిపి నేల పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.విత్తిన 25 రోజుల తర్వాత పొలంలో అంతర కృషి చేయాలి.అంతర కృషి వల్ల కలుపు మొక్కలు తొలగిపోతాయి.మట్టిని మొక్క మొదలు వరకు ఎగత్రోయాలి.ఈ చర్యలు తీసుకుంటూ ఏవైనా చీడపీడలు లేదా తెగులు ఆశిస్తే తొలి దశలోనే అరికడితే మంచి క్యారెట్ పంట దిగుబడి పొందవచ్చు.