పైసలు ఇస్తేనే పహాణి బయటికి వస్తుందట...?

యాదాద్రి భువనగిరి జిల్లా: చౌటుప్పల్ తాహసిల్దార్ కార్యాలయంలో పహణి కావాలంటే పైసా కొట్టాల్సిందేనని బాధిత రైతులు వాపోతున్నారు.రైతుల అమాయకత్వాన్ని, అవసరాన్ని ఆసరాగా చేసుకుని రికార్డ్ సెక్షన్లో పనిచేసే ఓ అధికారి పైసలిస్తేనే పహాణి ఇస్తానని విచ్చలవిడిగా లంచాలు తీసుకుంటూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 Corruption In Choutuppal Tahasildar Office For Pahani, Corruption ,choutuppal Ta-TeluguStop.com

సారు వారి వద్ద ఒక్కో పనికి ఒక్కో రేటు ఉంటుందని, ఎవరైనా సరే ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేస్తారని,ఆయన గారి చేతులు తడపనిదే ఇక్కడ పనులు అవుతలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ముడుపులు అందకుంటే ఎవరైనా సరే కార్యాలయం చుట్టూ తిప్పుకుంటారని టాక్ నడుస్తోంది.

అర్జెంట్ అయితే దానికొక రేటు కడతారట.ప్రజల అవసరాలని బట్టి సదరు రికార్డు సెక్షన్ అధికారి ఒక్కో రేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.వివిధ అవసరాల కోసం పహాణిలు తీసుకునే ప్రజల అవసరాలను గుర్తించి వారి వద్ద నుంచి డబ్బులు వసూళ్లు చేస్తుంటారని ఆరోపిస్తున్నారు.పహాణి దరఖాస్తు చేసుకుంటే వారం రోజుల లోగా ఇవ్వాల్సి ఉంటుంది.కానీ, సదరు అధికారి తలుచుకుంటే నెలలు గడిచినా రాదని,అదే అతను కోరిన డబ్బులు ముట్ట చెప్తే గంటలో ఇస్తారని,రియల్ ఎస్టేట్ వ్యాపారాలు తమ అవసరం కోసం ఒక్కో పహాణికి రూ.500 నుంచి రూ.2000 వరకు ఇస్తున్నట్టు తెలుస్తుంది.కాగా రైతులు అంత డబ్బులు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం.

కనీసం రూ.500 ఇవ్వనిదే పహాణిలు ఇవ్వడం లేదని, సదరు అధికారి కోరిన డబ్బులు ఇవ్వకపోతే డిప్యూటీ తహసీల్దార్ అందుబాటులో లేరని, సంతకాలు అవ్వడం లేదని కుంటిసాకులు చెప్తూ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇంత జరుగుతున్నా ఏమీ తెలియనట్లు పై అధికారులు మౌనం వహించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇదిలా ఉంటే ఆ రికార్డ్ సెక్షన్ ను పర్యవేక్షించే డిఫ్యూటీ తహశీల్దార్ బి.రాజేష్ మాత్రం మా కార్యాలయంలో పహాణిలకు డబ్బులు తీసుకుంటున్న విషయం మా దృష్టికి రాలేదని, పహాణిలకు ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే మా దృష్టికి తీసుకొస్తే వారిపై చర్యలు చేపడుతామని చెప్పడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube