నల్లగొండ జిల్లా:నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని అలీ నగర్ నుండి బంకాపురం, వెనిగండ్లకు వెళ్లే బీటీ రోడ్డు గత పది సంవత్సరాలుగా ఎవరూ పట్టించుకోకపోవడంతో పూర్తి శిథిలావస్థకు చేరుకుంది.ఈ రోడ్డుపై ప్రయాణం అంటేనే వాహనదారులు బెంబేలెత్తుతున్నారు.
ప్రతినిత్యం వెనిగండ్ల నుండి బంకాపురం నుండి వాహనదారులు వివిధ అవసరాల నిమిత్తం హాలియా,నల్గొండ, మిర్యాలగూడ, నిడమనూరు పట్టణాలకు ప్రయాణాలు చేస్తుంటారు.ఈ గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో పూర్తిగా టూ వీలర్స్ పై ఆధారపడి ప్రయాణిస్తుంటారు.
వెనిగండ్ల రోడ్డు పూర్తిగా శిథిలమై గుంటలు,కంకర తేలి టూ వీలర్స్ మీద ప్రయాణించే వాహనదారులు స్లిపై కింద పడి గాయాలపాలైన వారు ఎందరో ఉన్నారు.రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో వర్షాలు వచ్చినప్పుడు మోకాళ్ళ లోతు నీళ్లు నేలుస్తాయని, ఈ సమయంలో ప్రయాణం కష్టతరంగా మారుతుందని ప్రజలు వాపోతున్నారు.
గత పదేళ్ల నుండి అధికారులకు,నాయకులకు మొరపెట్టుకున్నప్పటికీ రోడ్డు నిర్మాణ పనులు గాని,కనీసం మరమ్మత్తులుగాని చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ సర్కార్ రావడం,జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్డు భవనాల శాఖ మంత్రి కావడంతో సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి చొరవ తీసుకొని బంకాపురం- వెనిగండ్ల రోడ్డు పునర్నిర్మించాలని ఈ గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు.ప్రజలు అవస్థలు పడుతుంటే పాలకులు చోద్యం చూశారని బంకాపురం గ్రామానికి చెందిన కొమ్ము వెంకటేశ్వర్లు( Kommu Venkateshwarlu ) అన్నారు.
ఏళ్ల తరబడి శిధిలమైన రహదారిపై ప్రయాణం చేస్తూ నిత్యం ప్రజలు అవస్థలు పడుతుంటే అప్పటి పాలకులు చోద్యం చూశారు.అలీ నగర్ నుండి వెనిగండ్ల రోడ్డు పూర్తిగా కంకరతేలి,పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వర్షం వచ్చినప్పుడు గుంతల్లో మోకాళ్ళ లోతు నీళ్లు చేరుతున్నాయి.
చాలామంది ఈ రోడ్డుపై ప్రయాణం చేస్తూ గాయాల పాలయ్యారు.ఎవరికీ చెప్పినా ఫలితం లేకుండా పోయింది.
కనీసం మరమ్మతులు చేపట్టలేదు.ఇప్పటికైనా స్పందించి రోడ్డు నిర్మాణం చేసి ప్రజల కష్టాలను తొలగించాలి.