రాజన్న సిరిసిల్ల జిల్లా: దమ్ముచేసిన పొలంలో వరిని నేరుగా విత్తే పద్ధతి తో రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ అన్నారు.ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇటీవల కాలంలో వరిసాగు ఖర్చు బాగా పెరిగింది.కూలీలపై ఖర్చు పెరగడం, కూలీలు సకాలంలో లభ్యం కావడం కష్టంగా మారింది.తరచుగా వచ్చే వర్షాభావ పరిస్థితుల వలన సకాలంలో వరి నాట్లు వేయలేకపోతున్నారు.కొన్ని పరిస్థితులలో సకాలంలో నీరందక ముదురు నారు నాటుట లేదా నారు దెబ్బతినడం వల్ల నాట్లు సకాలంలో పడక దిగుబడులు తగ్గడం గమనిస్తున్నాం.
ఇలాంటి పరిస్థితులలో సాగు ఖర్చు తగ్గించుకొని, కూలీల సమస్యను అధిగమిస్తూ సాంప్రదాయకంగా నారు పెంచి నాటేదానికి ప్రత్యామ్నాయ పద్ధతిని రైతుల పొలాలలో ఆచరణలోకి తీసుకరావటం జరిగింది.ఈ సాగు వలన కలుగు ఉపయోగములు –
1.
విత్తనం ఎకరానికి 15-20 కిలోలు ఆదా అవుతుంది. 2.
పంట 7-10 రోజుల ముందుగా కోతకు వస్తుంది. 3.నారు పెంపకం, నారు పీకడం, నాట్లు వేసే పని ఉండదు కాబట్టి సాగు ఖర్చు ఎకరానికి రూ.2500/- నుండి రూ.3000/- వరకు తగ్గుతుంది.4.మొక్కల సాంద్రత సరిపడా వుండటం వలన దిగుబడి 10-15 శాతం వరకు పెరుగుతుంది.5.తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణం విత్తుకోవచ్చు.6.కూలీల కొరతను అధిగమించవచ్చు.కూలీలపై ఆధారపడడం తగ్గుతుంది.
7.ప్రతికూల వాతావరణ పరిస్థితులలో పoట కాలం కోల్పోకుండా నీరు అందుబాటులో ఉన్నప్పుడే వరి సాగు చేసుకునే అవకాశముంది.8.ఈ పద్ధతికి వానాకాలం కంటే వేసవిలో అనుకూలంగా ఉంటుంది.
నేరుగా విత్తే పద్ధతిలో మెళకువలు :
1.నేలలు: చౌడు/క్షారము/ఆమ్లము నేలలు తప్ప సాధారణంగా వరిని సాగుచేసే అన్ని నేలలు అనుకూలం.ముంపుకు గురయ్యే భూములు సాగుకు అనుకూలం కాదు.2.విత్తన మోతాదు: రకాన్ని బట్టి ఎకరాకు 10-15 కిలోలు అవసరమవుతాయి.కాండం గట్టిగా వుండి వేరు వ్యవస్థ దృఢంగా వుండి పడిపోని రకాలు మిక్కిలి అనుకూలం.
ఆయా ప్రాంతానికి అనువైన, రైతుకు ఇష్టమైన ఏ రకమైనా ఈ పద్ధతిలో సాగు చేసుకోవచ్చును. 3.విత్తనాన్ని మందే కట్టడం: విత్తనాలను 24 గంటలు నానబెట్టి, నానిన విత్తనాలను గోనె సంచిలో వేసి కాని లేదా గోనే సంచి కప్పిగానీ 24 గంటల పాటు వుంచాలి.24 గంటల తర్వాత చూస్తే విత్తనాల ముక్కు పగిలి తెల్లగా మోసు వస్తుంది.రబీ పంట కాలంలో ఉష్ణోగ్రత తక్కువ ఉంటుంది.కాబట్టి 36 గంటల నుండె కట్టాలి. 4.ప్రధాన పొలం తయారీ: సాధారణ పద్ధతిలో వరి నాటేటప్పుడు భూమిని తయారుచేసినట్లుగానే ఈ పద్ధతిని కూడా తయారు చేయాలి.వీలైనంత బాగా చదును చేసుకోవాలి.పెద్దగా వున్న పొలాలను చిన్న మదులుగా విభజించుకుంటే చదును చేయడానికి, నీరు పెట్టడానికి విత్తనం చల్లడానికి ఎంతో అనుకూలంగా వుంటుంది.మండికట్టి మొలక వచ్చిన విత్తనాలను వెదజల్లి గాని, డ్రమ్ సీడర్లో గాని విత్తుకోవాలి.5.విత్తడానికి అవసరమయ్యే కూలీలు: ఈ పద్ధతిలో ఒక ఎకరా విత్తడానికి కేవలం ఇద్దరు కూలీలు సరిపోతారు.డ్రమ్ సీడర్ లాగడానికి ఒక మనిషి, గింజలు నింపడానికి, తాడు మార్చడానికి ఇంకొక మనిషి అవసరమవుతారు. 6.విత్తడానికి పట్టే సమయం: ఒక ఎకరా విత్తడానికి 2 గంటలు సరిపోతుంది.ఒక రోజులో 3 ఎకరాల వరకు విత్తుకోవచ్చు.7.ఎరువుల యాజమాన్యం: ఈ పద్ధతికి కూడా సాధారణ పద్ధతిలో సిఫారసు చేసిన మోతాదే సరిపోతుంది.కాకపోతే దమ్ములో నత్రజని ఎరువులు వేయకుండా కేవలం భాస్వరం ఎరువు (మొత్తం మోతాదు) పొటాష్ ఎరువు (సిఫారసు చేసిన మోతాదులో సగం) మాత్రమే వేయాలి.
దమ్ములోకానీ, విత్తేటప్పుడు కానీ నత్రజనిని వేస్తే కలుపు ఎక్కువగా వస్తుంది కాబట్టి ఆ సమయంలో నత్రజనినిచ్చే ఎరువులను వేయకూడదు.నత్రజని ఎరువులను 3 భాగాలుగా చేసి 1/3 భాగం విత్తిన 15-20 రోజులకు, 1/3 భాగం విత్తిన 40-45 రోజులకు మరియు మిగిలిన 1/3 భాగం నత్రజని, సగం పొటాష్ విత్తిన 60-65 రోజులకు వేయాలి.8.నీటి యాజమాన్యం: విత్తనం వేసినప్పటి నుండి పొట్ట దశ వరకు పొలంలో నీరు నిల్వ వుండకుండా కేవలం బురదగా మాత్రమే వుంచాలి.ఎక్కువైన నీరు బయటకు పోవడానికి కాలువలు ఏర్పాటు చేయాలి.దీని వలన వేర్లు ఆరోగ్యవంతంగా పెరిగి మొక్కలు ఎక్కువ పిలకలు పెడతాయి.పైరు పొట్ట దశ నుండి పంట కోసే 10 రోజుల ముందు వరకు 2 సెం.మీ.నీరు నిల్వ ఉండేలా చూసుకోవాలి.9.పురుగుల మరియు తెగుళ్ళ యాజమాన్యం: సాధారణ వరి సాగులో పోల్చుకుంటే ఈ పద్ధతిలో పురుగులు మరియు తెగుళ్ళ తాకిడి తక్కువగా ఉంటుంది.మొక్కలకు గాలి, వెలుతురు బాగా ప్రసరించడం చలన మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి.చీడపీడల నివారణకు సాధారణ వరిసాగుకు మాదిరిగానే సస్యరక్షణ చేపట్టాలి.10.పంట కోత: సాధారణ పద్ధతిలో పోలిస్తే ఈ పద్ధతిలో సాగు చేస్తే ఏ రకమైనా వారం నుండి వది రోజుల ముందే కోతకొస్తుంది.మామూలు పద్ధతిలో పోలిస్తే ఈ పద్ధతిలో 10 నుంచి 15 శాతం అధిక దిగుబడి వస్తుంది.
రైతుకు సాధారణ దిగుబడి వచ్చినా రైతుకు ఈ పద్ధతిలో నారుకుడి పెంపకం, నారు పీకడం, నాట్లు వేసే పనులపై ఖర్చు తగ్గుతుంది.కాబట్టి అధిక నికర ఆదాయం వస్తుందనీ జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు.







