బిజెపి కాంగ్రెస్( BJP, Congress ) లకు చెందిన ఢిల్లీ అగ్రనేతలంతా ఇప్పుడు తెలంగాణకు క్యూ కడుతున్నారు.మరికొద్ది రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో, బిజెపి ,కాంగ్రెస్ కు చెందిన కీలక నేతలంతా తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఎక్కడికక్కడ భారీ బహిరంగ సభలు, రోడ్డు షోలు నిర్వహించి ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈసారి తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే ప్రజలకు ఎంత మేలు జరుగుతుంది అనే విషయాలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు.
అధికార పార్టీ బీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని బిజెపి , కాంగ్రెస్ లు ముందుకు వెళుతున్నాయి.ఈసారి త్రిముఖ పోరు తీవ్రంగా ఉండబోతున్న నేపథ్యంలో, బీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు బిజెపి కాంగ్రెస్ లు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో బిజెపి, కాంగ్రెస్ కు చెందిన ఢిల్లీ నేతల తో పాటు , ఇతర రాష్ట్రాల్లోని ఆయా పార్టీల కీలక నేతలు ఇప్పటికే తెలంగాణలో ఎన్నికలకు ప్రచారం చేశారు.ఇప్పటికే కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించగా, తమిళనాడు , బీజేపీ అధ్యక్షుడు అన్నమలై సికింద్రాబాద్( Annamalai ) లో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు.అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నావీస్ హైదరాబాద్ కు వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహించారు .తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం తుది దశకు చేరుకున్న నేపథ్యంలో, హైదరాబాద్ లోని వివిధ వర్గాలకు చెందిన ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.సభలు, సమావేశాలు కార్నర్ మీటింగ్ లు, రోడ్డు షో లు నిర్వహిస్తూ వివిధ వర్గాల తో విడివిడిగా సమావేశం అవుతున్నారు.

ముఖ్యంగా ఐటీ నిపుణులు, నిరుద్యోగులు , మహిళలు వంటి వారిని లక్ష్యంగా చేసుకుని మంత్రి కేటీఆర్ ముందుకు వెళ్తుండడంతో, కాంగ్రెస్ , బిజెపి సైతం వారిని టార్గెట్ చేసుకుని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి .బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల భారీ బహిరంగ సభలు నిర్వహిస్తోంది.ఈనెల 25న సికింద్రాబాద్ లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.
దీనికి భారీగా జన సమీకరణ చేపట్టనున్నారు.ఇక ప్రధాని నరేంద్ర మోది ఈనెల 25, 26 , 27 తేదీల్లో తెలంగాణలో పర్యటించరున్నారు.
అనేక చోట్ల జరగనున్న సభలు, ర్యాలీలు, సమావేశాలు కార్నర్ మీటింగ్ లలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. 25న మహేశ్వరంలో జరగనున్న సభలో, 27న హైదరాబాద్ రోడ్ షోలో ప్రధాని పాల్గొంటారు.
ఇక ఈనెల 26 నుంచి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ( Rahul gandhi ) హైదరాబాదులోనే మకాం వేయనున్నారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ,బిజెపి నేత యోగి ఆదిత్యనాథ్ , కేంద్ర హోం మంత్రి తో పాటు మరి కొంతమంది బీజేపీ, కాంగ్రెస్ కు చెందిన కీలక నేతలు తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేపట్టి , ఫలితాన్ని తమ పార్టీకి అనుకూలంగా ఉండే విధంగా ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు.
దీంతో తెలంగాణలో మరింతగా రాజకీయ సందడి నెలకొంది.