భారతదేశంలో వరి ప్రధాన ఆహార పంటగా అధిక విస్తీర్ణంలో సాగు అవుతోంది.అయితే వరి పంటకు( Rice Cultivation ) ఉల్లికోడు సమస్య అధికంగా ఉండడం వల్ల రైతులు అధిక దిగుబడులు సాధించలేకపోతున్నారు.
ఉల్లికోడు యాజమాన్యంపై అవగాహన కల్పించుకున్న తర్వాత వరి పంటను సాగు చేస్తే అధిక దిగుబడి సాధించవచ్చని వ్యవసాయ క్షేత్ర నిపుణులు చెబుతున్నారు.ఈ ఉల్లికోడు పురుగులు చూడడానికి దాదాపుగా దోమ ఆకారంలో ఉంటాయి.
ఆడ ఉల్లికోడు పురుగులు లేత ఎరుపు రంగులో, మగ ఉల్లికోడు పురుగులు ముదురు ఎరుపు రంగులో ఉంటాయి.ఒక ఆడ ఉల్లికోడు పురుగు వరి మొక్క ఆకులపై, ఆకు తొడిమెలపై దాదాపుగా 100 నుంచి 200 వరకు గుడ్లు పెడుతుంది.
ఈ గుడ్ల దశ మూడు లేదా నాలుగు రోజులు ఉంటుంది.గుడ్లలో నుంచి లేత పురుగులు బయటకు వచ్చి ఆకు పొరల్లోకి చొచ్చుకుపోయి అక్కడి కణజాలం తింటూ బతుకుతాయి.

ఈ ఉల్లికొడు తల్లి పురుగులు తొలకరి వర్షాలు పడ్డాక పొలం గట్లపై ఉండే కలుపు మొక్కలను( Weeds ) ఆవాసాలుగా ఏర్పాటు చేసుకొని, వరి నాట్లు వేశాక క్రమంగా వరి పంటను ఆశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.నాట్లు ఆలస్యంగా వేసిన పొలాలలో వీటి ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది.వరి పంట నారుమడి దశ నుండి పిలక దశకు వచ్చేవరకు ఈ పురుగులు పంటను ఆశించే అవకాశం ఉంది.ఈ ఉల్లికోడు వరి పంటను ఆశించకుండా ఉండాలంటే.
వరి నాట్లు వేయడానికి ముందు పొలం గట్లపై ఉండే కలుపు మొక్కలను పూర్తిగా తీసేసి కాల్చి నాశనం చేయాలి.అయితే పొలం గట్లపై కలుపు నివారణ పిచికారి మందును ఉపయోగించాలి.

ఉల్లికోడును తట్టుకునే మేలు రకం వరి విత్తనాలను ఎంపిక చేసుకుని సాగు చేయాలి.నారు మొలికెత్తిన పది రోజులకు ఒక సెంటు నారుమడికి 160 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలను( Carbofuran 3g capsules ) పలుచగా చల్లి, నారుమడికి నీరు పెట్టి ఆ నీరు రెండు రోజులపాటు బయటకు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.ప్రధాన పొలంలో వరి నాట్లు వేసిన పది రోజుల తర్వాత ఒక ఎకరాకు 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలను వేయాలి.ఈ ఉల్లికోడు పంటను సోకిన తర్వాత అరికట్టే ప్రయత్నం చేయడం కంటే.
పంటకు సోకకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారానే అధిక దిగుబడి సాధించవచ్చు.







