ఇటీవలి కాలంలో అమెరికాలో సిక్కులపై మళ్లీ విద్వేషదాడులు పెరుగుతూ వుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.న్యూయార్క్ సిటీ బస్సులో గత వారం 19 ఏళ్ల సిక్కు సంతతి యువకుడిపై ఓ దుండగుడు దాడి చేయడంతో పాటు అతని తలపాగా లాగేందుకు యత్నించాడు.
ఈ ఘటనను మరిచిపోకముందే అదే న్యూయార్క్( New York ) నగరంలో సిక్కు సంతతికి చెందిన వృద్ధుడిని ఓ అగంతకుడు కొట్టి కొట్టి చంపాడు.వరుస ఘటనల నేపథ్యంలో అమెరికాలో వున్న సిక్కులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో న్యూజెర్సీ రాష్ట్రంలోని హోబోకెన్ నగర మేయర్, సిక్కు సంతతికి చెందిన రవి భల్లా( Ravi Bhalla ) ఆందోళన వ్యక్తం చేశారు.స్వయంగా ఆయన కూడా బెదిరింపులు ఎదుర్కొంటున్నారు.
అతనిని, అతని కుటుంబాన్ని చంపేస్తామంటూ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రవి భల్లాకు బెదిరింపు లేఖలు పంపుతున్నారు.

తొలుత గతేడాది ఆయనను మేయర్ పదవికి రాజీనామా చేయాల్సిందిగా బెదిరింపు లేఖలు వచ్చాయి .ఆ తర్వాతి నుంచి రవి కుటుంబాన్ని చంపేస్తామంటూ దుండగులు బెదిరించడం మొదలుపెట్టారు.సిక్కు మతం నేపథ్యంలోనే( background of Sikhism ) అతనిని లక్ష్యంగా చేసుకుని వుండొచ్చని సీబీఎస్ న్యూస్ మంగళవారం నివేదించింది.
ఇటీవలి ఘటనలపై రవి భల్లా ఓ ప్రకటన విడుదల చేశారు.న్యూయార్క్‌లోని రిచ్‌మండ్ హిల్‌లో సిక్కు సమాజాన్ని కదిలించిన ద్వేషపూరిత నేరాలపై తాను కలవరపడ్డానని ఆయన చెప్పారు.
కదులుతున్న బస్సులోనే సిక్కు యువకుడిపై దాడి చేయడంతో పాటు దుండగుడు అతని తలపాగాను బలవంతంగా తొలగించేందుకు ప్రయత్నించాడని రవి భల్లా పేర్కొన్నారు.మరో ఘటనలో వృద్ధుడైన సిక్కు వ్యక్తి దాడికి గురై ప్రాణాలు కోల్పోయాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ద్వేషం, హింస అనేవి ఖండించదగిన చర్యలని… ఇవి ఐక్యత, వైవిధ్యం, అంగీకారంతో కూడిన అమెరికన్ విలువల గుండెపై దాడి చేస్తాయని రవి భల్లా వ్యాఖ్యానించారు.ఈ పరిస్థితుల్లో అందరూ ఒక్కటై స్నేహపూరిత వాతావరణాన్ని పెంపొందించాలని ఆయన పిలుపునిచ్చారు.ఒక ప్రభుత్వ అధికారిగా, హోబోకెన్ మేయర్‌గా.ద్వేషం, అసహనం, వివక్షకు వ్యతిరేకంగా గళమెత్తుతానని, చర్యలు తీసుకుంటానని రవి ఎస్ భల్లా ప్రతిజ్ఞ చేశారు.వైవిధ్యమే మా బలం అని గుర్తుంచుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.కాగా.
గత సోమవారం విడుదల చేసిన ఎఫ్‌బీఐ డేటా ప్రకారం 2022లో 198 సిక్కు వ్యతిరేక ద్వేషపూరిత నేరాలు నమోదయ్యాయి.దీనిని బట్టి అమెరికాలో ద్వేషపూరిత నేరాలను ఎదుర్కొంటున్న రెండవ సమూహంగా సిక్కులు నిలిచారు.







