తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా తీవ్ర కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలో రాజకీయాలు రసకందాయంగా మారాయి.
ఖమ్మం మేయర్ తో పాటు కొందరు అధికార పార్టీ బీఆర్ఎస్ కార్పొరేటర్లుపై కాంగ్రెస్ పార్టీ కన్నేసింది.
మరోవైపు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఖమ్మం అసెంబ్లీకి ఖరారు అయ్యారన్న సంగతి తెలిసిందే.
దీంతో జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక వ్యూహాంతో ముందుకు వెళ్తోందని చెప్పుకోవచ్చు.
ఇందులో భాగంగానే తుమ్మల మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ అసంతృప్త నేతలను కలుస్తున్నారు.దీంతో ఖమ్మం మేయర్ పూనుకోల్లు నీరజ సహా సుమారు 25 మంది కార్పొరేటర్లు హస్తం గూటికి చేర్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ప్రస్తుతం 12 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి అంగీకారం తెలిపారని తెలుస్తోంది.పాలేరు నియోజకవర్గంతో పాటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక వ్యూహాన్ని కొనసాగిస్తున్నారు తుమ్మల మరియు పొంగులేటి.
ఈ క్రమంలో ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ బాలసానితో పాటు కార్పొరేటర్లు కమర్తపు మురళీ, చావా నారాయణ, రావూరి సైదబాబు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని సమాచారం.అదేవిధంగా ఖమ్మం మేయర్ సైతం కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధం అయ్యారని ప్రచారం జోరుగా సాగుతోంది.
ఏదీ ఏమైనా ఖమ్మంలో మాజీ మంత్రి తుమ్మల జోష్ కొనసాగుతోందని చెప్పుకోవచ్చు.దీంతో ఖమ్మం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.







