తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు( Chandrababu Arrest ) నేపథ్యంలో రాష్ట్ర టీడీపీ అనేక నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే.స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో దాదాపు 20 రోజులకు పైగా ఉన్నారు.
మరోపక్క బెయిల్ రావడం లేదు.ఈ క్రమంలో చంద్రబాబు జైలుకు వెళ్లిన నాటి నుండి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ( TDP ) నాయకులు కార్యకర్తలు రకరకాలుగా నిరసనలు తెలియజేస్తున్నారు.
రాజకీయ కక్షతోనే చంద్రబాబుని అక్రమ కేసులో ఇరికించి అరెస్టు చేశారని వైసీపీ ప్రభుత్వం పై మండిపడుతున్నారు.
ఇదిలా ఉంటే సెప్టెంబర్ 30 శనివారం సాయంత్రం చంద్రబాబు గారి అరెస్టుకు నిరసనగా “మోత మోగిద్దాం” అనే కార్యక్రమం నిర్వహించడం తెలిసిందే.
ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు పళ్ళాలు, ఈలలు, డప్పులు, హారన్ల శబ్దాలతో మోత మోగించారు.గ్రామాలలో పట్టణాలలో భారీ ఎత్తున తెలుగుదేశం శ్రేణులు హోరెత్తించారు.
రాజమండ్రిలో నారా బ్రాహ్మణి( Nara Brahmani ) డప్పు కొట్టి, విజిల్ ఊది మద్దతు తెలిపారు.నారా లోకేష్ ఎంపీలతో కలిసి ఢిల్లీలో మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.